నర్సంపేట, మహా : తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం తెల్లవారుజాము నుంచి సమ్మె మొదలైంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మరోవైపు సమ్మెకు మద్ధతుగా ఆర్టీసీ ఉద్యోగులు చాలా చోట్ల నిరసనలు చేపట్టారు. అయితే నిరసనలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కోలా శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ నర్సంపేట బస్టాండ్ ఎదుట శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ హఠాత్ పరిణామంతో తోటి సిబ్బంది, బందోబస్తులో ఉన్న పోలీసులు, బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులు నివ్వెర పోయారు. వెంటనే తేరుకుని శంకర్ గౌడ్ కు అంటుకున్న మంటలను ఆర్పి వేశారు. ఆయనను వరంగల్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు శంకర్ గౌడ్ కు చికిత్స అందిస్తున్నారు.








