ఆర్సీబీకి చారిత్రక ఘనత.
* 300 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువ దాటిన తొలి ఐపీఎల్ ఫ్రాంచైజీ.
*:20.6 బిలియన్ డాలర్లకు చేరిన ఐపీఎల్ బ్రాండ్ విలువ.
* ముంబయి రెండో, కేకేఆర్ మూడో స్థానంలో.
ఢిల్లీ, మహా.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 300 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువను అధిగమించిన తొలి ఐపీఎల్ ఫ్రాంచైజీగా నిలిచి మరో మైలురాయిని అందుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హౌలిహాన్ లోకీ విడుదల చేసిన ‘2026 ఐపీఎల్ వాల్యుయేషన్ స్టడీ’ నివేదిక ప్రకారం, ఆర్సీబీ బ్రాండ్ విలువ 16 శాతం పెరిగి 312 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇదే సమయంలో ఐపీఎల్ మొత్తం బ్రాండ్ విలువ తొలిసారిగా 20.6 బిలియన్ డాలర్లకు చేరి ప్రపంచ క్రీడా లీగ్‌లలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.
2026 సీజన్లో ఆర్సీబీ పురుషుల జట్టుతో పాటు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లోనూ టైటిల్ సాధించడం, ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ఆదరణ మరింత పెరగడం, స్పాన్సర్‌షిప్‌లు, వాణిజ్య ఒప్పందాల విస్తరణ వంటి అంశాలు బ్రాండ్ విలువ పెరగడానికి ప్రధాన కారణాలని నివేదిక వెల్లడించింది. జట్టు ప్రదర్శనతో పాటు మార్కెటింగ్ వ్యూహాలు, డిజిటల్ వ్యాపార విస్తరణ కూడా ఆర్సీబీ విలువను కొత్త స్థాయికి తీసుకెళ్లినట్లు పేర్కొంది.
బ్రాండ్ విలువల జాబితాలో 264 మిలియన్ డాలర్లతో ముంబయి ఇండియన్స్ రెండో స్థానంలో నిలవగా, 245 మిలియన్ డాలర్లతో కోల్‌కతా నైట్ రైడర్స్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ 244 మిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో నిలిచింది. మహేంద్ర సింగ్ ధోని జట్టులో లేకపోవడం, 2026 సీజన్లో వరుస పరాజయాలు ఎదుర్కోవడం సీఎస్కే బ్రాండ్ విలువపై ప్రభావం చూపినట్లు నివేదిక విశ్లేషించింది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ వరుస స్థానాల్లో నిలిచాయి.
ఐపీఎల్ బ్రాండ్ విలువ గత కొన్నేళ్లుగా వేగంగా పెరుగుతోందని నివేదిక వెల్లడించింది. 2023లో 15.4 బిలియన్ డాలర్లుగా ఉన్న ఐపీఎల్ విలువ 2024లో 16.4 బిలియన్ డాలర్లకు, 2025లో 18.5 బిలియన్ డాలర్లకు పెరిగి, 2026 నాటికి 20.6 బిలియన్ డాలర్లను చేరుకుంది. మీడియా హక్కులు, స్పాన్సర్షిప్ ఒప్పందాలు, టికెట్ విక్రయాలు, డిజిటల్ ప్రసారాల ద్వారా 2026 సీజన్ ఆదాయం 1.8 బిలియన్ డాలర్లను దాటే అవకాశముందని నివేదిక అంచనా వేసింది.
2028 నుంచి అమల్లోకి రానున్న కొత్త మీడియా హక్కుల ఒప్పందంతో ఐపీఎల్ వ్యాపార విలువ మరింత పెరిగే అవకాశం ఉందని హౌలిహాన్ లోకీ నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల సంఖ్య పెరగడం, ప్రసార హక్కుల విలువ విస్తరించడం, కార్పొరేట్ పెట్టుబడులు అధికమవడం వంటి అంశాలు ఐపీఎల్‌ను ప్రపంచంలో అత్యంత విలువైన క్రీడా లీగ్‌లలో ఒకటిగా నిలబెడుతున్నాయని నివేదిక విశ్లేషించింది.






