Mahaa Daily Exclusive

  టాటా ‘ట్రెంట్‌’ లాభాల జాతర..

Share

* 5 లక్షల మందికిపైగా ఇన్వెస్టర్లకు సిరిసంపదలు.
* చరిత్రలోనే తొలిసారిగా బోనస్‌ షేర్ల ప్రకటన.
* 600 శాతం భారీ డివిడెండ్‌కు గ్రీన్ సిగ్నల్.
* జుడియో, వెస్ట్‌సైడ్‌ జోరుతో ‘ట్రెంట్‌’ సరికొత్త రికార్డులు.
* కళ్లుచెదిరేలా ఆర్థిక ఫలితాలు.

ముంబయి, మహా.

టాటా గ్రూపునకు చెందిన రిటైల్ దిగ్గజం ‘ట్రెంట్ లిమిటెడ్’ తన వాటాదారులకు కాసుల వర్షం కురిపించింది. మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో సంస్థ కళ్లుచెదిరే లాభాలను నమోదు చేయడమే కాకుండా, తన సుమారు 5 లక్షల మందికి పైగా ఉన్న చిన్న మదుపర్ల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ కీలక ప్రకటనలు చేసింది. తన కార్పొరేట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 1:2 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించడంతో పాటు, ఒక్కో షేరుపై ఏకంగా 600 శాతం (రూ. 6) మేర భారీ డివిడెండ్‌ను సిఫార్సు చేసి దలాల్ స్ట్రీట్‌ను ఆశ్చర్యపరిచింది. జుడియో, వెస్ట్‌సైడ్ వంటి బ్రాండ్ల అద్భుతమైన పనితీరుతో పాటు వినియోగదారుల ఆదరణ తోడవడంతో సంస్థ లాభాల్లో కొత్త శిఖరాలను అధిరోహించింది.
లాభాల జోరు.. ఆదాయంలోనూ దూకుడు
ట్రెంట్ లిమిటెడ్ విడుదల చేసిన ఆర్థిక ఫలితాల ప్రకారం, గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం (PAT) గతేడాదితో పోలిస్తే 33 శాతం పెరిగి రూ. 413 కోట్లకు చేరుకుంది. ఆదాయం విషయంలోనూ సంస్థ 19 శాతం వృద్ధిని కనబరిచి రూ. 5,028 కోట్లను ఆర్జించింది. ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటున్న జుడియో (Zudio) బ్రాండ్ ఈ త్రైమాసికంలోనే ఏకంగా 109 కొత్త స్టోర్లను ప్రారంభించి తన నెట్‌వర్క్‌ను 963కు పెంచుకోవడం విశేషం. వెస్ట్‌సైడ్ కూడా తన ఉనికిని చాటుకుంటూ 300 స్టోర్ల మార్కును అందుకుంది. ఈ విస్తరణ మరియు అమ్మకాల వృద్ధి కారణంగా సంస్థ యొక్క ఆపరేటింగ్ మార్జిన్లు గణనీయంగా మెరుగుపడి, ఇన్వెస్టర్ల నమ్మకాన్ని బలపరిచాయి.
బోనస్‌ ధమాకా.. వాటాదారుల్లో హర్షాతిరేకాలు
తమపై నమ్మకం ఉంచిన సుమారు ఐదు లక్షల మందికి పైగా ఉన్న వాటాదారులకు కృతజ్ఞతగా సంస్థ యాజమాన్యం బోనస్ షేర్ల వర ప్రకటించింది. ప్రతి రెండు షేర్ల కలిగి ఉన్న వాటాదారుకు ఒక అదనపు షేరును ఉచితంగా అందజేయాలని బోర్డు నిర్ణయించింది. ఇది సంస్థ యొక్క ఆర్థిక పటుత్వాన్ని సూచించడమే కాకుండా, మార్కెట్లో షేర్ల లభ్యతను పెంచి సామాన్య ఇన్వెస్టర్లకు కూడా ఈ స్టాక్‌ను మరింత చేరువ చేస్తుంది. దీనికి తోడు రూ. 1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుపై రూ. 6 డివిడెండ్ ప్రకటించడం అంటే పెట్టుబడిపై 600 శాతం రాబడి అందించడమే. ఈ పరిణామాల నేపథ్యంలో, మార్కెట్ విశ్లేషకులు ట్రెంట్ భవిష్యత్తుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంస్థ కేవలం రిటైల్ రంగంలోనే కాకుండా, బ్యూటీ, ఫుట్‌వేర్ వంటి విభాగాల్లోనూ దూసుకుపోతుండటం శుభపరిణామమని పేర్కొంటున్నారు.