Mahaa Daily Exclusive

  కోర్టు దృశ్యాల ప్రసారంపై కేజ్రీవాల్‌కు హైకోర్టు నోటీసులు.

Share

• సోషల్‌ మీడియాలో వీడియోల షేరింగ్‌పై తీవ్ర ఆగ్రహం.
• తక్షణమే తొలగించాలని ఆదేశం.
• ఆప్‌ నేతలు, జర్నలిస్టు రవీశ్‌ కుమార్‌ సహా పలువురికి సమన్లు.
• కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ.
ఢిల్లీ, మహా.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యాయస్థాన కార్యకలాపాలకు సంబంధించిన వీడియోలను అనధికారికంగా రికార్డు చేసి, సోషల్ మీడియా వేదికలపై ప్రసారం చేసినందుకు గాను ఆయనతో పాటు మరికొందరు నేతలకు హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ముందు జరిగిన విచారణ వీడియోలను ‘ఎక్స్’ (ట్విట్టర్), ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల్లో షేర్ చేయడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను వాయిదా వేసింది.
నిబంధనల ఉల్లంఘనపై కోర్టు సీరియస్
న్యాయవాది వైభవ్ సింగ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, న్యాయస్థాన నియమాలను ఉల్లంఘించడంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు వీడియో కాన్ఫరెన్సింగ్ రూల్స్-2021 ప్రకారం, అనుమతి లేకుండా కోర్టు విచారణలను రికార్డు చేయడం లేదా ప్రసారం చేయడం నిషిద్ధం. ఏప్రిల్ 13న మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ స్వయంగా వాదనలు వినిపించిన సమయానికి సంబంధించిన వీడియో క్లిప్పులను ఆప్ నేతలు ఉద్దేశపూర్వకంగా వైరల్ చేశారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.
వీడియోల తొలగింపునకు ఆదేశాలు
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన గూగుల్, మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్), ఎక్స్ కార్పొరేషన్లకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్ వాదనలకు సంబంధించిన అనధికారిక వీడియో క్లిప్పులను తక్షణమే తమ ప్లాట్‌ఫామ్‌ల నుండి తొలగించాలని స్పష్టం చేసింది. పిటిషనర్ గుర్తించిన అదనపు లింకులను కూడా బ్లాక్ చేయాలని సామాజిక మాధ్యమ సంస్థలకు సూచించింది. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కూడా చర్యలు తీసుకోవాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది.
వీరిపై కూడా నోటీసులు
కేజ్రీవాల్‌తో పాటు ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సంజీవ్ ఝా, జర్నైల్ సింగ్ మరియు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌లకు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. ప్రముఖ జర్నలిస్టు రవీష్ కుమార్ పేరును కూడా పిటిషనర్ ఈ జాబితాలో చేర్చారు. వీరందరూ సదరు వీడియోలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేశారని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పిటిషనర్ ఆరోపించారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం చేత విచారణ జరిపించాలని ఆయన కోరారు. న్యాయ వ్యవస్థపై ఒత్తిడి పెంచేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని నివేదించారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కోర్టు ఆదేశాల మేరకు వివరణ ఇచ్చేందుకు ప్రతివాదులకు నాలుగు వారాల సమయం లభించింది.