మహా వరంగల్ బ్యూరో ;
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఆర్టీసీ డిపోలో గురువారం ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న మనస్తాపంతో డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. తోటి సిబ్బంది వెంటనే మంటలు ఆర్పి, హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా ఎంజీఎం వైద్యులు శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో మెరుగైన చికిత్స కోసం పోలీసులు ప్రత్యేక అంబులెన్స్ లో హుటా హుటిన హైదరాబాద్ కు తరలించడం జరిగింది.
*శంకర్ గౌడ్ ను పరామర్శించిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు*
ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో కలిసి మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లి శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వైద్యులను కలిసి శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి పై వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలియజేయడంతో నరేందర్ ఆవేదన వ్యక్తం చేస్తూ మెరుగైన చికిత్సను అందించాలని డాక్టర్లకు సూచించారు.
శంకర్ గౌడ్ త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.
అనంతరం నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యంతోనే ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని నరేందర్ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారికి తగిన న్యాయం చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నరేందర్ డిమాండ్ చేశారు.








