- ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దాడులు
- హైదరాబాద్, తిరుపతిలో 12 చోట్ల సోదాలు
- కీలక పత్రాలు స్వాధీనం
- ఇది వరకే రూ. 442 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ
విజయవాడ, మహా : ఏపీ మద్యం కేసులో నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు రాజ్ కేసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణ మోహన్, ఇళ్లల్లో ఉదయం నుంచే సోదాలు మొదలయ్యాయి. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ నివేదిక ఆధారంగా తిరుపతి, విజయవాడతో పాటు హైదరాబాద్‌లోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఆస్తి పత్రాలు, డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్న ఈడీ..
మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులు, నిందితులైన మాజీ ప్రజాప్రతినిధులు, అధికారుల నివాసాలే లక్ష్యంగా హైదరాబాద్, తిరుపతిలోని 12 ప్రాంతాల్లో ఈడీ హైదరాబాద్ యూనిట్ భారీ సోదాలు నిర్వహించింది. ఇప్పటికే నమోదైన ఈసీఐఆర్ ఆధారంగా ఇది రెండో విడత దర్యాప్తు అని, సోదాల సమయంలో కీలక ఆస్తి పత్రాలు, ఆర్థిక లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డి వంటి ప్రముఖులపై ఈడీ తీవ్ర ఆరోపణలు చేసింది. విజయసాయి రెడ్డి మద్యం సరఫరా ఆర్డర్లను ప్రభావితం చేశారని, చెవిరెడ్డి నిధుల తరలింపు, విదేశీ పెట్టుబడుల వ్యవహారాలను పర్యవేక్షించారని ఈడీ పేర్కొంది. అలాగే మాజీ సీఎం జగన్ మాజీ కార్యదర్శి ధనంజయ రెడ్డి మద్యం కొనుగోలు వ్యవస్థల్లో మాన్యువల్ మార్పులు చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సిట్, ఈడీ దర్యాప్తులో తేలింది.
ఈ మొత్తం కుంభకోణానికి రాజ్ కేసిరెడ్డి ప్రధాన సూత్రధారి అని ఈడీ గుర్తించింది. ఏపీఎస్‌బీసీఎల్ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని, మాన్యువల్ ప్రొక్యూర్‌మెంట్ సిస్టమ్ ద్వారా కొన్ని బ్రాండ్లకు అధిక ధరలు కల్పించి భారీగా కిక్‌బ్యాక్‌లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ. 3,200 కోట్ల నేరపూరిత ఆదాయాన్ని ఆదన్, లీలా డిస్టిలరీస్, ఇతర రియల్ ఎస్టేట్ సంస్థల ద్వారా మనీలాండరింగ్ చేశారని, కుటుంబ సభ్యుల పేర్లతో ఆస్తులు కొనుగోలు చేసి అసలు యాజమాన్యాన్ని దాచిపెట్టారని ఈడీ తన నివేదికలో వెల్లడించింది. వీరితో పాటు ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి మధ్యవర్తిగా వ్యవహరించగా, ట్యాగ్ డెవలపర్స్ యజమాని తాళ్ల అవినాష్ గౌడ్, ముప్పిడి అవినాష్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి వంటి వారు నిధుల మళ్లింపు, తయారీదారులతో సమన్వయం వంటి కీలక బాధ్యతలు నిర్వహించినట్లు ఈడీ సోదాల్లో ఆధారాలు లభించాయి. ఈ పరిణామాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
ఇదివరకే 442 కోట్లు జప్తు చేసిన ఈడీ
గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) ద్వారా జరిగిన భారీ మద్యం కుంభకోణంలో ఈడీ 442 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఇటీవల జప్తు చేసింది. మద్యం సేకరణ, సరఫరా, విక్రయాల్లో నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి ప్రభుత్వ ఖజానాకు వేల కోట్లు గండి కొట్టారని ఈడీ తన దర్యాప్తులో నిర్ధారించింది. డిజిటల్ చెల్లింపులను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి, కేవలం నగదు రూపంలోనే లావాదేవీలు నిర్వహించడం ద్వారా భారీ ఎత్తున నల్లధనం పోగుచేశారని గుర్తించారు. ఈ అక్రమ నిధులను వివిధ బినామీ సంస్థల ద్వారా స్థిరాస్తులుగా మార్చినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. ఈ కుంభకోణంలో రాజ్ కేసిరెడ్డి, వాసుదేవ రెడ్డిలు కీలక పాత్రధారులుగా ఉన్నారని ఈడీ పేర్కొంది. గత ప్రభుత్వంలో వీరు రాష్ట్ర మద్యం పాలసీని తమకు అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు తెరలేపారు. తమకు కావాల్సిన కంపెనీలకే మద్యం సరఫరా కాంట్రాక్టులు దక్కేలా చేయడం, తక్కువ నాణ్యత కలిగిన మద్యాన్ని సామాన్యులకు అధిక ధరలకు విక్రయించడం ద్వారా వచ్చిన వేల కోట్ల కమిషన్లను దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని సాగించిన ఈ భారీ దోపిడీలో బినామీ కంపెనీల నెట్‌వర్క్ కీలకంగా మారిందని ఈడీ గుర్తించింది. మద్యం సిండికేట్లుగా ఏర్పడి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, వ్యక్తిగత లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టారని ఈడీ పేర్కొంది. ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే అంశంపై ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.








