- ఆప్ నేరాల్లో భాగం కాలేకే
- పార్టీ ఎదుగుదల కోసం 15 ఏళ్ళు పని చేశా
- దేశం కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆప్ పని చేస్తోంది
- కేజ్రీవాల్ పై రాఘవ్ చద్ధా సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, మహా : ఆప్‌ను వీడాలనే తమ నిర్ణయం వెనుక అసలు కారణం ఉందని ఆ పార్టీని వీడిన రాఘవ్ చద్ధా పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మూడింట రెండొంతుల మంది సభ్యులం బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నాం.. ఆప్ ఎదుగుదల కోసం 15 ఏళ్లపాటు నా రక్తం, చెమట ధారపోశాను.. కానీ, ఏ ఉద్దేశాలతో పార్టీ ఏర్పడిందో వాటికి దూరమైంది…. కొన్నేళ్లుగా దేశం కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆప్ పనిచేస్తోంది.. సరైన పార్టీలో ఉన్నాననే భావన నాలో లేదు. అందుకే పార్టీకి దూరమై.. ప్రజలకు దగ్గరవుతున్నట్టు ప్రకటిస్తున్నాను’’ అని తెలిపారు. ఈ నెల మొదట్లో రాఘవ్ చద్దాను ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ‘‘నేను ఆప్ కార్యకలాపాలకు దూరం కావడానికి గల కారణం ఇప్పుడు బయటపెడుతున్నాను… వారి నేరాల్లో నేను భాగం కావాలనుకోలేదు.. అందులో భాగం కాలేదు కాబట్టే మెప్పు పొందలేకపోయాను.. మా ముందు రెండే మార్గాలు కనిపించాయి.. ఒకటి రాజకీయాల నుంచి వైదొలగడం.. రెండు మా అనుభవాన్ని ఉపయోగించి సానుకూల రాజకీయాలు చేయడం.. అందుకే మేము రెండోది ఎంచుకుని. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాం ’’ అని తనను కలిసిన మీడియా ప్రతినిధులతో రాఘవ్ చద్ధా అన్నారు.
‘‘ఆమ్ ఆద్మీ పార్టీ తన సూత్రాలు, నైతిక విలువలు, ఆదర్శాల నుంచి పక్కకు తప్పుకుంది. అది దేశం కోసం గానీ, దేశ నిర్మాణం కోసం గానీ కాకుండా, కేవలం తన స్వప్రయోజనాల కోసమే పనిచేస్తుంది. మీలో చాలామంది ఈ విషయం నాకు చెప్పారు.. నేను తప్పుడు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని అని నాకు కూడా అనిపించింది’’ అని పేర్కొన్నారు. తనతో పాటు స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సింహ్ సాహ్నీలు బీజేపీలో చేరుతారని తెలిపారు. రాజ్యసభలో మొత్తం 10 మంది ఆప్ సభ్యులుండగా ఏడుగురం కలిసి ఉన్నామని ఆయన చెప్పారు. ఆప్ పార్లమెంటరీ పార్టీ విలీనం కోరుతూ తాము సంతకాలు చేసిన లేఖలను రాజ్యసభ ఛైర్మన్‌కు సమర్పించినట్టు యువ ఎంపీ వెల్లడించారు.







