Mahaa Daily Exclusive

  బీజేపీలో చేరికపై మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి క్లారిటీ.. “మేము పార్టీ మారడం లేదు”

Share

  • అబ్బే అదేం లేదు
  • బీజేపీలో చేరికపై మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
  • అన్ని పార్టీల నేతల్ని కలుస్తున్నానని స్పష్టం
  • బీఆర్ఎస్ అంటే గౌరవం
  • బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ప్రీతిరెడ్డి

హైదరాబాద్, మహా : గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబం పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ఆయన కోడలు ప్రీతి రెడ్డి తెరదించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీని కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాము బిజెపిలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆమె పూర్తిగా ఖండించారు. తాను బీజేపీ నేతలను కలవడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఏవీ లేవని ప్రీతి రెడ్డి స్పష్టం చేశారు. తమ యూనివర్సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీ కీలక నేతలను కలిసినట్లు వివరించారు. ప్రధానిని పిలుస్తున్నాం కాబట్టి, సహజంగానే బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని, అందుకే చంద్రశేఖర్ తివారీని కలిశానని ఆమె వెల్లడించారు. రెండు రోజుల కిందట.. మల్లారెడ్డి కుటుంబంతో సహా ప్రధాని మోదీని కలిశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వారిని ప్రధాని వద్దకు తీసుకెళ్లారు.

మల్లారెడ్డి బీఆర్ఎస్‌లోనే !

మల్లారెడ్డి పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ప్రీతి రెడ్డి తేల్చి చెప్పారు. మల్లారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మాకు బీఆర్ఎస్ పార్టీ మీద, నాయకత్వం మీద పూర్తి గౌరవం ఉంది అని ఆమె పేర్కొన్నారు. కేవలం తమ విద్యాసంస్థల అభివృద్ధి, కార్యక్రమాల కోసమే ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నామని, దానిని రాజకీయ కోణంలో చూడవద్దని కోరారు. తాను కేవలం బీజేపీ నేతలను మాత్రమే కాకుండా, అన్ని పార్టీల ప్రముఖులను కలుస్తుంటానని ప్రీతి రెడ్డి గుర్తు చేశారు. ఇందులో భాగంగానే ఇటీవల రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును కూడా కలిసినట్లు ఆమె ప్రస్తావించారు. విద్యావేత్తగా తమ యూనివర్సిటీ కార్యక్రమాల నిమిత్తం ప్రభుత్వ పెద్దలను, వివిధ పార్టీల నేతలను కలవడం సాధారణ ప్రక్రియేనని ఆమె క్లారిటీ ఇచ్చారు.