* కార్మికులు ఆందోళన చెందొద్దు.
* డిప్యూటీ సీఎం భట్టి.
హైదరాబాద్, మహా.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ అకాల మరణం అత్యంత బాధాకరమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, కార్మికులు ఆవేశాలకు లోనుకాకుండా సంయమనం పాటించాలని ఆయన కోరారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో జరిగిన చర్చల సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏ సమస్యకైనా చర్చల ద్వారా ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుందని, అంతా కలిసి కూర్చుని మాట్లాడుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని ఆయన కార్మిక నేతలకు భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. మన సంస్థను మనమే బలోపేతం చేసుకోవాలని, అప్పుడే కార్మికుల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, అప్పటి పాలకులు కార్మికుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించడం వల్ల సంస్థ చిన్నాభిన్నమైందని భట్టి విక్రమార్క విమర్శించారు. గత పాలకుల మాదిరిగా తమ ప్రభుత్వం వ్యవహరించబోదని, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.
ఆర్టీసీకి సంబంధించిన పాలనాపరమైన, విధానపరమైన ప్రతి అంశంపై కార్మిక సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించుకుందామని, యాజమాన్యం మరియు కార్మికులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ చర్చల్లో పాల్గొన్న జేఏసీ నాయకులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా, వాటిపై సానుకూలంగా స్పందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన హామీ లభించడంతో చర్చలు ఫలప్రదంగా ముగిశాయి.








