Mahaa Daily Exclusive

  శంకర్‌గౌడ్‌ భౌతికకాయం తరలింపునకు పోలీసుల అడ్డంకి…

Share

నర్సంపేట,మహా.
ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ అకాల మరణంతో నర్సంపేట మండలం ముత్తోజీపేటలో విషాద చాయలు అలుముకోగా, శనివారం నాటి పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ గ్రామానికి చేరుకుని, శంకర్‌గౌడ్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం, ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు కేంద్ర మంత్రిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. శంకర్‌గౌడ్‌ భౌతికకాయాన్ని చివరిసారిగా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్దకు తీసుకెళ్లేందుకు అనుమతించేలా చూడాలని వారు మంత్రిని కోరారు.
కేంద్ర మంత్రి జోక్యంతో భౌతికకాయాన్ని డిపోకు తరలించేందుకు బీజేపీ శ్రేణులు, ఆర్టీసీ సంఘాల నాయకులు ప్రయత్నించగా.. పోలీసులు వారిని మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. నిబంధనల పేరుతో పోలీసులు అడ్డంకులు సృష్టించడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్మికులు ‘ఆర్టీసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు జేఏసీ నాయకులను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించడంతో ముత్తోజీపేటలో ఘర్షణ వాతావరణం నెలకొంది.
ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో గ్రామం దద్దరిల్లింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్మికుల పట్ల మొండిగా వ్యవహరిస్తోందని, కనీసం అంతిమయాత్రకు కూడా సహకరించడం లేదని బీజేపీ కార్యకర్తలు, కార్మికులు మండిపడ్డారు. భారీగా మోహరించిన పోలీసు బలగాలు, కార్మికుల ఆందోళనలతో ముత్తోజీపేట రణరంగంగా మారింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, అరెస్టయిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.