*సమ్మె సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలి.
* బీజేపీ జాతీయ నాయకులు, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల కో ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి.
హైదరాబాద్, మహా.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విచారకరమని, ఈ విషాద ఘటనకు ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీజేపీ జాతీయ నాయకులు, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల కో ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి ఆరోపించారు. కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పడితే, వారి సమస్యలను సామరస్యంగా పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రాణనష్టాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నా పాలకులలో ఏమాత్రం చలనం లేకపోవడం వారి నిరంకుశ ధోరణికి నిదర్శనమని విమర్శించారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మరోవైపు, కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని, సామాన్య ప్రజానీకం అడుగడుగునా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటోందని పొంగులేటి ఆందోళన వ్యక్తం చేశారు. బస్సు సౌకర్యం లేక, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో బస్టేషన్లలో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా పసిపిల్లలతో ప్రయాణించే తల్లులు, వృద్ధులు, మహిళలు గంటల తరబడి బస్టాండ్లలో పడిగాపులు కాస్తూ నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన చెందారు. ఒకపక్క గమ్యస్థానాలకు చేరుకోలేక, మరోపక్క ప్రైవేటు వాహనాల దోపిడీతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం దారుణమన్నారు. ప్రజల కష్టాలను చూసైనా పాలకుల గుండె కరగకపోవడం శోచనీయమని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం ఇకనైనా తన మొండి పట్టింపులను, అహంకారాన్ని పక్కనపెట్టి వాస్తవ పరిస్థితులను గ్రహించాలని పొంగులేటి సుధాకరరెడ్డి హితవు పలికారు. ఆర్టీసీ కార్మికులతో తక్షణమే చర్చలు జరిపి, నెలకొన్న ప్రతిష్టంభనకు సత్వరమే ఒక ముగింపు పలకాలని అన్నారు. కార్మికులు మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యల వంటి కఠిన నిర్ణయాలు తీసుకోకుండా భరోసా కల్పించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. వెంటనే ఆర్టీసీ సమ్మె సమస్యకు పరిష్కారం చూపి, అటు కార్మికుల ప్రాణాలను కాపాడటంతో పాటు, ఇటు సామాన్య ప్రజానీకానికి రవాణా కష్టాలను దూరం చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.








