* హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా శిఖాగోయల్.
హైదరాబాద్, మహా.
రాష్ట్ర పోలీస్ యంత్రాంగంలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా అత్యంత కీలకమైన హోంశాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను శిఖాగోయల్‌కు అప్పగించారు. ప్రస్తుత బాధ్యతలతో పాటు ఆమెకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరియు ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్‌గా కూడా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మరోవైపు విజిలెన్స్ డీజీగా సీనియర్ అధికారి డి.ఎస్. చౌహాన్‌ను నియమించగా, శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన మల్టీజోన్-2 ఐజీపీగా షానవాజ్ ఖాసిం బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీకి తొలి పోలీస్ కమిషనర్‌గా తరుణ్ జోషిని నియమించడం గమనార్హం. డ్రగ్స్ నియంత్రణ విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా అవినాష్ మొహంతికి బాధ్యతలు అప్పగించారు.
మల్కాజిగిరి నూతన పోలీస్ కమిషనర్‌గా బి. సుమతిని బదిలీ చేయగా, ఎస్‌ఐబీ ఐజీపీగా కార్తికేయకు పూర్తి అదనపు బాధ్యతలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పరిపాలనా సౌలభ్యం, వివిధ విభాగాల్లో సమర్థవంతమైన పనితీరును దృష్టిలో ఉంచుకుని ఈ కీలక మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ బదిలీలు తక్షణమే అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.








