Mahaa Daily Exclusive

  రాజ్యసభలో ‘కమలం’ జోరు..

Share

* బీజేపీలో విలీనమైన ఆప్‌ పార్లమెంటరీ పక్షం.
ఢిల్లీ, మహా.
దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పార్లమెంటరీ పక్షం అధికార భారతీయ జనతా పార్టీలో విలీనమైంది. ఈ మేరకు ఆప్‌కు చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతున్నట్లు ఆ పార్టీ ఎంపీ రాఘవ్‌ చడ్డా అధికారికంగా ప్రకటించారు. ఈ తాజా పరిణామంతో ఎగువ సభలో బీజేపీ బలం సెంచరీ మార్కును దాటి మరింత పటిష్టమైంది. ఇప్పటికే 106 మంది సభ్యులతో సభలో అతిపెద్ద పార్టీగా కొనసాగుతున్న బీజేపీ సంఖ్యాబలం, తాజా చేరికలతో 113కు పెరగనుంది.
మిత్రపక్షాలతో కలిపి ఇప్పటివరకు 125 స్థానాల వద్ద ఉన్న ఎన్డీఏ కూటమి బలం ఇప్పుడు మరింత పెరగడంతో కేంద్ర ప్రభుత్వానికి కీలక బిల్లుల ఆమోదం విషయంలో మార్గం సుగమమైంది. విపక్ష కూటమిలో కీలకమైన ఆప్‌ సభ్యులు ఒకేసారి అధికార పక్షం వైపు మొగ్గు చూపడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. సభలో స్పష్టమైన ఆధిపత్యం దిశగా బీజేపీ అడుగులు వేస్తుండటంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రతిపక్షాల వ్యూహాలకు గండి కొడుతూ, తమ బలాన్ని పెంచుకోవడంలో బీజేపీ విజయవంతమైంది. ఎగువ సభలో ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకోవడం ఇకపై విపక్షాలకు క్లిష్టతరంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Latest