* రూ. 13,615 కోట్ల రుణానికి ఐఆర్‌ఎఫ్‌సీ పచ్చజెండా.
హైదరాబాద్ , మహా.
హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాజెక్టు టేకోవర్ కోసం దాదాపు రూ. 13,615 కోట్ల భారీ రుణాన్ని అందించేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలు, డాక్యుమెంట్లపై గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది. దీంతో ఈ నెల 30వ తేదీ నాటికి మెట్రో రైలు పూర్తిస్థాయిలో ప్రభుత్వ పరం కావడానికి మార్గం సుగమమైంది. ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టును, సుమారు రూ. 15 వేల కోట్ల వ్యయంతో ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోనుంది. ఇందులో రూ. 13 వేల కోట్ల రుణంతో పాటు రూ. 2 వేల కోట్ల ఈక్విటీ వాటా ఉంది.
ఐఆర్‌ఎఫ్‌సీ అందించే ఈ రుణాన్ని 20 ఏళ్ల కాలపరిమితిలో మెట్రో రైలు సంస్థ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడమే కాకుండా, లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్‌ను కూడా సమర్పించనుంది. ఐఆర్‌ఎఫ్‌సీ తొలుత రూ. 12,750 కోట్లకే మొగ్గు చూపినప్పటికీ, ప్రభుత్వం కోరిక మేరకు అదనపు మొత్తానికి అంగీకరించడం గమనార్హం. ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి అందే మొత్తం పోగా, మిగిలిన నిధులను హెచ్‌ఎండీఏ ద్వారా ప్రభుత్వం సమకూర్చనుంది. స్వాధీన ప్రక్రియ తర్వాత కార్యకలాపాల్లో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రస్తుతం ఎల్‌అండ్‌టీలో పనిచేస్తున్న 115 మంది ఉద్యోగులను మరో ఏడాది పాటు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. వీరి వేతనాల కోసం అయ్యే రూ. 24.3 కోట్ల ఖర్చును హెచ్‌ఎంఆర్‌ఎల్ స్వయంగా భరించనుంది.
మెట్రో నిర్వహణపై సలహాలు, సూచనల కోసం ఎల్‌అండ్‌టీకి చెందిన ఏడుగురు సీనియర్ అధికారుల సేవలను ఆరు నెలల పాటు వినియోగించుకోనున్నారు. కాగా, ఎల్‌అండ్‌టీకి గతంలో ప్రభుత్వం ఇచ్చిన రూ. 900 కోట్ల వడ్డీ లేని రుణాన్ని ప్రస్తుత స్వాధీన విలువ నుంచి మినహాయించాలని కేబినెట్ సబ్కమిటీ సిఫార్సు చేసింది. అలాగే లేబర్ సెస్, స్టాంప్ డ్యూటీ, విద్యుత్ బకాయిలు మరియు ప్రకటనల పన్నుకు సంబంధించి ఎల్‌అండ్‌టీ నుంచి ఇండెమ్నిటీ తీసుకోవాలని నిర్ణయించారు. పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు, జీఎస్‌టీ క్లెయిమ్‌ల విషయంలోనూ స్పష్టమైన మార్గదర్శకాలను ఖరారు చేశారు. ఈ నెలాఖరుతో లావాదేవీల ప్రక్రియ పూర్తయి, మే 1 నుంచి హైదరాబాద్ మెట్రో పూర్తిస్థాయిలో ప్రభుత్వ నిర్వహణలోకి రానుంది.








