*పంజాబీలకు బీజేపీ ద్రోహం చేసిందని విమర్శ.
ఢిల్లీ, మహా.
రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పార్లమెంటరీ పక్షం విలీనం జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించగా, దీనిపై ఆ పార్టీ అగ్ర నాయకత్వం తీవ్రస్థాయిలో మండిపడింది. రాఘవ్ చడ్డా నేతృత్వంలోని ఏడుగురు సభ్యులు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఇది పంజాబీలకు కేంద్రంలోని అధికార పార్టీ చేసిన తీరని ద్రోహమని ధ్వజమెత్తారు. బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసం మరోసారి పంజాబ్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా ఆరోపించారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారిని, ద్రోహం చేసిన వారిని పంజాబ్ ప్రజలు ఎన్నటికీ క్షమించరని ఆయన హెచ్చరించారు.
మరోవైపు, ఈ పరిణామాలపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీని వీడిన ఏడుగురు ఎంపీలను దేశద్రోహులుగా అభివర్ణించిన ఆయన, వారు పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించే అర్హతను కోల్పోయారని విమర్శించారు. శరద్ పవార్ పార్టీ, శివసేన, కాంగ్రెస్‌లలో ఏ విధంగానైతే ‘వాషింగ్ మెషీన్’ వ్యూహాన్ని అమలు చేసిందో, ఇప్పుడు ఆప్ విషయంలోనూ బీజేపీ అదే కుట్రకు పాల్పడిందని దుయ్యబట్టారు. పంజాబ్‌లో పట్టు లేని కారణంగానే అడ్డదారుల్లో పార్టీని చీల్చడానికి ప్రయత్నిస్తోందని, కానీ పంజాబీలు తమను హృదయపూర్వకంగా ప్రేమిస్తారని, ద్రోహుల విషయంలో అంతే కఠినంగా ఉంటారని స్పష్టం చేశారు. ఆరోపించడానికి ఏమీ దొరకకే ఆప్‌ను విచ్ఛిన్నం చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని, ప్రజలు తమ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ విలీనం వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా హస్తం ఉందని ఆప్ పంజాబ్ విభాగం తీవ్ర ఆరోపణలు చేసింది. ఏడుగురు ఎంపీలను చీల్చి తీసుకువస్తే రాఘవ్ చడ్డాకు కేంద్ర మంత్రి పదవి ఇస్తామని అమిత్ షా ఆఫర్ ఇచ్చారని ఆప్ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి బల్తేజ్ పన్నూ పేర్కొన్నారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల ద్వారా ఎంపీలను భయపెట్టి, ఒత్తిడికి గురిచేసి బీజేపీలో చేర్చుకున్నారని ఆరోపించారు. చిన్న వయసులోనే రాఘవ్ చడ్డాకు రాజ్యసభ అవకాశం కల్పించిన కేజ్రీవాల్‌కు ఆయన వెన్నుపోటు పొడిచారని, పదవుల కోసం ఆశపడి పంజాబ్ ప్రజల విశ్వాసాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అయితే, ఆప్ చేస్తున్న ఈ ఆరోపణలన్నీ నిరాధారమని, అబద్ధాల కట్ట అని కొట్టిపారేసిన బీజేపీ.. ఆ పార్టీ వైఫల్యాల వల్లే నేతలు బయటకు వస్తున్నారని కౌంటర్ ఇచ్చింది.








