కోల్‌కతా, మహా.
పశ్చిమ బంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సాగిస్తున్న అరాచకాల నుంచి మహిళలకు విముక్తి కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఘంటాపథంగా చెప్పారు. రాష్ట్రంలో రెండో దశ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన ప్రచారాన్ని హోరెత్తించారు. శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీకి పట్టం కడితే ఏళ్ల తరబడి మహిళలు పడుతున్న కష్టాలకు చరమగీతం పాడుతామని హామీ ఇచ్చారు. టీఎంసీ ఒక మహిళా వ్యతిరేక పార్టీ అని, ఆ పార్టీ హయాంలో భయం, అవినీతి, సిండికేట్ వ్యవస్థలు వేళ్లూనుకున్నాయని మండిపడ్డారు. నిరుద్యోగం, చొరబాటుదారుల ఆక్రమణల నుంచి బంగాల్‌ను కాపాడుకోవాలంటే బీజేపీ నేతృత్వంలోని అభివృద్ధి నమూనా ఒక్కటే మార్గమని ఆయన మహిళా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఘటనను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. మహిళలు రాత్రిపూట బయటకు రావద్దని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం దారుణమని, నేరస్థులను శిక్షించాల్సింది పోయి బాధితులపై ఆంక్షలు విధించడం టీఎంసీ నైజమని ధ్వజమెత్తారు. కూతురిని డాక్టరుగా చూడాలనుకున్న ఒక తల్లి కలలను టీఎంసీ చిన్నాభిన్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే సదరు బాధిత తల్లిని, అలాగే సందేశ్‌ఖాలీ బాధితురాలిని తమ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దింపామని వెల్లడించారు. మహిళా శక్తిపై తనకు పూర్తి నమ్మకం ఉందని, 21వ శతాబ్దపు బంగాల్ కొత్త చరిత్రను ఈ సోదరీమణులే రాస్తారని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని ప్రధాని హెచ్చరించారు. “ఇది మోదీ గ్యారెంటీ.. మే 4న బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత గతంలో జరిగిన ప్రతి అన్యాయం, అకృత్యంపై ఫైళ్లు తెరుస్తాం” అని స్పష్టం చేశారు. బంగాల్ సోదరీమణుల కలలను నెరవేర్చడానికి, వారి జీవితాలను సులభతరం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. మహిళలకు భద్రతతో పాటు గౌరవం, ఐశ్వర్యం లభించేలా చూస్తామని, పేద మహిళలకు ఉచిత రేషన్ అందిస్తూ వారి హక్కులను ఏ సిండికేట్ కూడా లాక్కోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ వాగ్దానం చేశారు.








