*కేసీఆర్ మారిన మర మనిషి.
*తొలి ఏడాదే నాలుగు లక్షల కొలువులు.
*రేవంత్ సర్కార్‌ది కర్కోటక పాలన.
*ఆత్మ కోల్పోయిన బీఆర్ఎస్.
*ఉద్యమకారులకు లక్ష సూపర్ న్యూమరరీ ఉద్యోగాలు.
*ఉచిత విద్య, వైద్యమే పార్టీ ధ్యేయం.
*తెలంగాణ గడ్డపై పాంచజన్యం పూరించిన కవిత.
• తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త పార్టీ ప్రకటించిన కల్వకుంట్ల కవిత.
హైదరాబాద్, మహా.
**తెలంగాణ రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. ఉద్యమ కాలం నుంచి తండ్రి వెంటే ఉండి, అధికారంలోనూ కీలక పాత్ర పోషించిన కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రయాణంలో అత్యంత సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రకటించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అనే సరికొత్త రాజకీయ పక్షాన్ని ఏర్పాటు చేస్తూ, గత పదేళ్ల పాలనలోని లోపాలను బహిరంగంగా అంగీకరించి రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేశారు. తెలంగాణ ఆత్మను కోల్పోయిన బీఆర్ఎస్ స్థానంలో, మళ్లీ ఉద్యమ ఆకాంక్షలను ప్రతిబింబించేలా, సామాజిక న్యాయాన్ని పునాదిగా చేసుకుని ఈ పార్టీని ముందుకు నడుపుతానని ఆమె ఉద్వేగభరితంగా ప్రసంగించారు. అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల ఆశయాలు మరుగునపడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఒక తల్లి మనసుతో ప్రజల కష్టాలు తీర్చేందుకు సిద్ధమైనట్లు ఆమె ప్రకటించారు**
**ఉద్యమ వారసత్వం – జాగృతి జ్ఞాపకాలు**
తన రాజకీయ ప్రయాణంలో ఇదొక మరుపురాని రోజని పేర్కొన్న కవిత, గడిచిన 20 ఏళ్లలో తెలంగాణ జాగృతి ద్వారా తాను చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఇంటి ఆడబిడ్డను బతుకమ్మ ద్వారా ఏకం చేశామని, బతుకమ్మ పాట ద్వారానే మన సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చామని వివరించారు. జాగృతి ఆడబిడ్డల చేతిలో కాగడాలై ఉద్యమానికి బలమైన పునాది వేశారని కొనియాడారు. తెలంగాణ వస్తే చాలని భావించిన అమరవీరుల కుటుంబాలకు, నిరంతరం కష్టపడే సింగరేణి కార్మికులకు, భవిష్యత్ వారసులైన యువతకు ఆమె శిరస్సు వంచి నమస్కరించారు. దైవ నిర్ణయం మేరకే మనందరం మళ్లీ ఒక ప్రజా పోరాటం కోసం కలిశామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
**గత పాలనపై పశ్చాత్తాపం – క్షమాపణలు**
కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నడిచిన తెలంగాణ ఉద్యమ రథం, తర్వాతి కాలంలో దారి తప్పిందని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాజిక న్యాయం అనే రథ చక్రం విరిగి ముక్కలైందని, మనం కలలు కన్న తెలంగాణ సాకారం కాలేదని ఆవేదన చెందారు. ఇసుక దందాల కోసం దళితులను పొట్టనబెట్టుకున్న తీరును, నిరంతరం నిఘా నీడలో ఫోన్ మాట్లాడాలంటే భయపడే పరిస్థితుల్లో బతికామని ఆమె స్వయంగా అంగీకరించారు. ఆనాటి పరిపాలనలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నానని, కేవలం క్షమాపణ చెబితే సరిపోదని, ఆ తప్పులను దిద్దుకోవడానికే ‘తెలంగాణ రాష్ట్ర సేన’ ద్వారా ప్రజల ముందుకు వస్తున్నానని స్పష్టం చేశారు. రాజకీయ అధికారం ఉంటేనే ప్రజలకు సేవ చేసే రాజకీయ ఆత్మ ఉంటుందని ఆమె వివరించారు.
**కేసీఆర్ మార్పు – ఒక మర మనిషిగా విశ్లేషణ**
తండ్రి కేసీఆర్ గారిపై ఆమె చేసిన విమర్శలు సభను ఆశ్చర్యపరిచాయి. ఆనాటి కేసీఆర్ వేరని, ఈనాటి కేసీఆర్ వేరని ఆమె వ్యాఖ్యానించారు. నాడు చేనేత కార్మికులు చనిపోతే భిక్షమెత్తి సాయం చేసిన మనిషి, నేడు అధికారం చేతికి వచ్చాక ‘మర మనిషి’ (రోబో) గా మారిపోయారని ఎద్దేవా చేశారు. గుంటనక్కలు, తోడేళ్ల మధ్య చిక్కుకున్న ఆయనకు ప్రజా సమస్యలు కనిపించడం లేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల కోసం లక్షల కోట్లు ఖర్చు చేసినా కేవలం 14 లక్షల ఎకరాలకే నీరు అందడం బాధాకరమని అన్నారు. కష్టమొచ్చినప్పుడు ప్రజల దగ్గరకు వెళ్లాల్సిన కేసీఆర్ గారు, నేషనల్ పార్టీ అంటూ ఇతర రాష్ట్రాలకు వెళ్లడం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆమె విశ్లేషించారు.
**బీజేపీ వైఖరిపై నిప్పులు – బానిస ఎంపీలకు సవాల్**
తెలంగాణ అంటేనే బీజేపీకి గిట్టదని, తల్లిని చంపి బిడ్డను తీశారన్న అగ్రనేతల మాటలే దానికి నిదర్శనమని కవిత విమర్శించారు. తెలంగాణ విభజనను భారత్-పాక్ విభజనతో పోల్చిన ఎంపీలపై బీజేపీలోని ‘బానిస ఎంపీలు’ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఏడు మండలాలు ఆంధ్రలో కలిపినా, భద్రాచలం వద్ద ఐదు గ్రామాలను మనకు ఇవ్వకుండా మొండిచేయి చూపినా బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం సిగ్గుచేటన్నారు. బీజేపీ ఎంపీలకు దమ్ముంటే భద్రాచలం వద్ద ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణకు తీసుకురావాలని సవాల్ విసిరారు. సామాజిక న్యాయానికి బీజేపీ వ్యతిరేకమని, మహిళా బిల్లు, బీసీ గణనను పక్కన పెట్టడమే దానికి నిదర్శనమని ఆమె ఆరోపించారు.
**కాంగ్రెస్ కర్కోటక పాలన – ప్రజల ఆవేదన**
రాష్ట్రంలో ప్రస్తుతం ‘కర్కోటకుడి పాలన’ నడుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెలుగుమట్లలో పర్మిషన్లు ఉన్న ఇళ్లను కూలగొట్టడం వల్ల ఒక గర్భిణీకి అబార్షన్ కావడం తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల్లో విషాహారం వల్ల విద్యార్థులు చనిపోతున్నా, లాకప్ డెత్‌లు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ మీద బీజేపీ కంటే తామే బలంగా పోరాడుతామని, వచ్చే రెండేళ్లలో అధికారంలోకి రాబోయేది తెలంగాణ రాష్ట్ర సేన పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న పార్టీలన్నీ కుటుంబ పాలన, అవినీతితో నిండిపోయాయని, సామాన్యుల పక్షాన నిలిచేది తమ పార్టీయేనని స్పష్టం చేశారు.
**పాంచజన్యం: ఉచిత విద్య – ఉజ్వల భవిష్యత్తు**
పార్టీ అజెండాగా ‘పాంచజన్యం’ పేరుతో ఐదు ప్రధాన అంశాలను కవిత ప్రకటించారు. అందులో మొదటిది విద్య. బడిని గుడిలా భావిస్తామని, ప్రతి గ్రామంలో పాఠశాల, తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదివినా సరే, తల్లిదండ్రులపై ఒక్క రూపాయి భారం పడకుండా ప్రాథమిక విద్య నుంచి పీహెచ్‌డీ వరకు ఉచిత విద్యను అందిస్తామని మాటిచ్చారు. విద్యార్థులు గిగ్ వర్కర్లుగా మారుతున్న పరిస్థితిని మారుస్తామని, విద్యా బాధ్యతను ‘అమ్మ’ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. విద్యతోనే తెలంగాణ బిడ్డలు ప్రపంచాన్ని ఏలుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
**వైద్యరంగంలో విప్లవం – ఉచిత ఆరోగ్య భరోసా**
ప్రజారోగ్యం విషయంలో తెలంగాణ రాష్ట్ర సేన సరికొత్త భరోసా ఇచ్చింది. ఎంత పెద్ద రోగం వచ్చినా సరే రూపాయి ఖర్చు లేకుండా ఉచిత వైద్యం అందిస్తామని కవిత ప్రకటించారు. పేదవారు వైద్యం కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదని, ప్రభుత్వమే అన్ని రకాల వైద్య ఖర్చులను భరిస్తుందని తెలిపారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తే తెలంగాణ బిడ్డలే కష్టపడి సంపాదించి భవిష్యత్తులో ప్రభుత్వానికి తిరిగి ఇస్తారని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణమే తమ పార్టీ ప్రధాన ఆశయమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
**రైతే రాజు – వ్యవసాయానికి అగ్రతాంబూలం**
వ్యవసాయ రంగాన్ని మళ్లీ పూర్వవైభవానికి తీసుకువస్తామని, రైతును రాజు చేసే విధంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని కవిత తెలిపారు. 24 గంటల విద్యుత్, సకాలంలో యూరియా పంపిణీతో పాటు రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా రైతు గర్వంగా తలెత్తుకుని తిరిగేలా చేస్తామని, వారి గౌరవాన్ని పెంచడమే తమ లక్ష్యమని వివరించారు. రైతు సంక్షేమం కేవలం మాటలకే పరిమితం కాకుండా, చేతల్లో చూపిస్తామని ఆమె భరోసా ఇచ్చారు.
**ఉపాధి కల్పన – యువతకు ఆర్థిక అండ**
యువతకు ఉపాధి కల్పించే విషయంలో తమ ప్రభుత్వం సరికొత్త మార్గాలను ఎంచుకుంటుందని కవిత వివరించారు. కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, స్వంతంగా ఎదగాలనుకునే యువతకు 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ‘మీ అమ్మ ప్రభుత్వం’ నేరుగా యువతకు రుణాలు అందిస్తుందని, వారి ఆలోచనలకు పెట్టుబడి ఇస్తుందని హామీ ఇచ్చారు. యువతపై తనకు పూర్తి నమ్మకం ఉందని, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని ఆమె పేర్కొన్నారు.
**ఉద్యోగాల జాతర – సూపర్ న్యూమరరీ పోస్టులు**
నిరుద్యోగులకు మరియు ఉద్యమకారులకు కవిత తీపి కబురు అందించారు. తెలంగాణ రాష్ట్ర సేన అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఒకే నోటిఫికేషన్ ద్వారా 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా, తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల కోసం జూన్ 2, 2014 కటాఫ్ తేదీగా లక్ష ‘సూపర్ న్యూమరరీ’ పోస్టులను క్రియేట్ చేస్తామని సంచలన హామీ ఇచ్చారు. ఉద్యమకారుల వయసు, రక్తం ఈ గడ్డ కోసం ధారబోశారని, వారిని గౌరవించుకోవడం మన బాధ్యతని ఆమె గుర్తుచేశారు. ఆత్మ లేని మరబొమ్మల పాలన పోవాలని, అమ్మతనంతో కూడిన పాలన రావాలని పిలుపునిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.








