- వివాహేతర సంబంధం
- కూతురును షాప్‌కు పంపి
- భర్తను చున్నీతో చంపిన భార్య
ఎల్ బి నగర్, మహా : నమ్ముకున్న భర్త, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలు, పచ్చని సంసారం.. వీటన్నింటికంటే ఓ పరాయి వ్యక్తితో ఏర్పడిన వివాహేతర బంధమే ఎక్కువనుకుంది ఓ మహిళ. క్షణిక సుఖాల కోసం కట్టుకున్నవాడిని కడతేర్చడమే కాకుండా, ఆ పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆత్మహత్యగా నాటకమాడింది. కానీ చట్టం ముందు ఆమె నాటకాలు సాగలేదు. హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన బోడ నర్సింగ్ (36), స్వరూప దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చిన ఈ కుటుంబం.. ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో నివాసం ఉంటోంది. నర్సింగ్ కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న తరుణంలో స్వరూపకు తన సొంత ఊరికే చెందిన మోహన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.
గత కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనపై నర్సింగ్‌కు అనుమానం రావడంతో ఆమె బంధం గురించి అసలు నిజం తెలుసుకున్నాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ తీవ్రస్థాయిలో గొడవలు జరగడం ప్రారంభమైంది. తనకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన స్వరూప.. అతడిని ఎలాగైనా వదిలించుకోవాలని క్రూరమైన పథకం పన్నింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 20వ తేదీన స్వరూప తన పథకాన్ని అమలు చేసింది. ఇంట్లో భర్త ఉన్న సమయం చూసి, తన చిన్న కూతురిని ఏదో వస్తువు తీసుకురావాలని బయట ఉన్న దుకాణానికి పంపించింది. కూతురు బయటకు వెళ్లగానే, నర్సింగ్‌పై ఒక్కసారిగా దాడి చేసి తన ఒంటిపై ఉన్న చున్నీతో గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేసింది.
భర్త ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాక, ఏమీ తెలియనట్టుగా ఆ శవాన్ని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నాడంటూ చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నర్సింగ్ మరణంపై అనుమానం రావడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికలో నర్సింది ఆత్మహత్య కాదని, గొంతు నులమడం వల్లే ఊపిరాడక చనిపోయాడని వైద్యులు తేల్చి చెప్పారు. వైద్యుల నివేదిక ఆధారంగా పోలీసులు స్వరూపను తమదైన శైలిలో విచారించగా, ఆమె చేసిన పాపాన్ని అంగీకరించింది. మోహన్‌తో ఉన్న బంధానికి అడ్డు వస్తున్నాడనే భర్తను చంపేసినట్లు విచారణలో ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రియుడు మోహన్ పాత్రపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.








