Mahaa Daily Exclusive

  జర్నలిస్టుల సమస్యల పై రాజీలేని పోరాటం…

Share

*జర్నలిస్టుల సమస్యల పై రాజీలేని పోరాటం*

*ఎన్ యు జె. (ఐ) జాతీయ కార్యవర్గ సమావేశాల పిలుపు*

*తెలంగాణ రైజింగ్ పై జాతీయ ప్రతినిధులకు వివరణ*

*హైదరాబాద్ వేదికగా రెండ్రోజుల సదస్సు విజయవంతం*

మహా వరంగల్ బ్యూరో;

దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి సంక్షేమమే ధ్యేయంగా నేషనల్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐ) జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌ ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని ఓ ప్రైవేట్ హాల్ లో ఘనంగా నిర్వహించబడ్డాయి. సంస్థ జాతీయ అధ్యక్షులు సురేష్ శర్మ అధ్యక్షతన జరిగిన రెండు రోజుల సదస్సులో జర్నలిస్టుల భద్రత, హక్కుల సాధన పై కీలక తీర్మానాలు చేశారు.
తొలిరోజు శ్రామిక జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా
సమావేశాల మొదటి రోజు కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర కార్మిక సంక్షేమ, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ గమనాన్ని నిర్దేశించే జర్నలిస్టులను కూడా కార్మిక సంక్షేమ పరిధిలోకి తీసుకువచ్చి, వారి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, ఆరోగ్య భీమా వంటి సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.
రెండవ రోజు…. *ప్రజాస్వామ్య రక్షణలో జర్నలిస్టుల పాత్ర*

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
రెండవ రోజు సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై శ్రీకారం చుట్టారు. పాలకులకు, ప్రజలకు మధ్య వారధిగా నిలిచే జర్నలిస్టుల పాత్రను ఆయన కొనియాడారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి జాతీయ స్థాయిలో పోరాడాల్సిన అవసరం ఉందని, అందుకు తమ ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ రైజింగ్ అభివృద్ధి పథంలో నవ రాష్ట్రం
ఈ సమావేశాలలో ప్రధాన ఆకర్షణగా “తెలంగాణ రైజింగ్” అంశం నిలిచింది. ఈ సెషన్‌లో హాజరైన ప్రభుత్వ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన జాతీయ స్థాయి జర్నలిస్టులకు తెలంగాణ అభివృద్ధి నమూనాను సమగ్రంగా వివరించారు.
కీలక తీర్మానాలు
సమస్త జాతీయ అధ్యక్షులు సురేష్ శర్మ మాట్లాడుతూ.. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ‘జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్’ ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వేతన బోర్డుల ఏర్పాటు, డిజిటల్ మీడియా జర్నలిస్టులకు గుర్తింపు వంటి అంశాల పై తీర్మానాలను ఆమోదించారు.
హైదరాబాద్ ఆతిథ్యం, తెలంగాణ అభివృద్ధిని చూసి జాతీయ ప్రతినిధులు అబ్బురపడ్డారు. ఈ సమావేశం జర్నలిస్టుల ఐక్యతకు కొత్త శక్తిని ఇచ్చిందని సురేష్ శర్మ అన్నారు. ఈ రెండు రోజుల సదస్సు తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని నేతృత్వంలో జరుగగా సంస్థ ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రాష్ట్ర పార్టీనిధులు హాజరయ్యారు. కాగా ఈ కార్యక్రమాలలో టీపీసీసీ ఉపాద్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ, వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆయూబ్, డెమాక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు వివేక్, సామాజిక వేత్త కరాటే ప్రభాకర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశాల్లో తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ జిల్లాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Latest