Mahaa Daily Exclusive

  తాటి ముంజల చెంత.. నేతల ఆత్మీయ పలకరింత…

Share

**తాటి ముంజల చెంత.. నేతల ఆత్మీయ పలకరింత**
**ముంజల బండి వద్ద ముచ్చటించిన ఈటల, దత్తన్న**
**ప్రకృతి ఫలాలతో సేదతీరిన ఎంపీ.. గౌడన్నల కష్టాలపై ఆరా**

హైదరాబాద్, మహా.

వేసవి భానుడు భగభగలాడుతున్న వేళ, రాజకీయ క్షేత్రంలో ఒక ఆహ్లాదకరమైన , ఆత్మీయ దృశ్యం ఆవిష్కృతమైంది. నిత్యం ప్రజా సమస్యలు, రాజకీయ సమీకరణాలతో బిజీగా ఉండే ఇద్దరు సీనియర్ నేతలు, సామాన్యుల మాదిరిగా రోడ్డు పక్కన ఆగి ప్రకృతి ప్రసాదించిన ఫలాలను ఆస్వాదించడం చర్చనీయాంశంగా మారింది. ఎంపీ ఈటల రాజేందర్ తన స్థానిక పర్యటనలో భాగంగా వెళ్తుండగా, మార్గమధ్యంలో తాటి ముంజల బండిని చూసి తన వాహనాన్ని ఆపారు. తన వెంట ఉన్న నాయకులతో కలిసి ఆ వేసవి ఫలాలను రుచి చూస్తుండగా, అదే దారిలో ప్రయాణిస్తున్న హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా అక్కడ ఆగడంతో వాతావరణం ఒక్కసారిగా సందడిగా మారిపోయింది.
పెద్దలు దత్తన్నను చూడగానే ఈటల రాజేందర్ ఎంతో గౌరవంగా, ఆత్మీయంగా ఆహ్వానించారు. “అన్నా.. ముంజలు తింటావా!” అంటూ ఆయన సహజ సిద్ధమైన శైలిలో పలకరించిన తీరు అక్కడున్న వారిని ఆకట్టుకుంది. పాత మిత్రులిద్దరూ కలిసి కాసేపు సరదాగా ముచ్చటించుకుంటూ, ఎండ వేడిని మర్చిపోయి తాటి ముంజలను ఆస్వాదించారు. ఒకరు పార్లమెంటు సభ్యుడిగా, మరొకరు మాజీ గవర్నర్ వంటి ఉన్నత హోదాలో ఉన్నప్పటికీ, ఎలాంటి ఆడంబరాలు లేకుండా సాధారణ పౌరుల మధ్య ఇలా సమయాన్ని గడపడం వారి నిరాడంబరతకు అద్దం పట్టింది.
ముంజల విందు ముగిసిన అనంతరం, ఈటల రాజేందర్ అక్కడి గౌడ సోదరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వేసవిలో తాటి ముంజల సేకరణలో పడుతున్న కష్టాలను, వృత్తిపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. కాయలు కోసే విధానం నుంచి అమ్మకాల వరకు వారి జీవన స్థితిగతులను ఆరా తీశారు. ప్రజలతో మమేకమవ్వడమే కాకుండా, వారి వృత్తి కష్టాలను గుర్తించడం ఈటల శైలిని మరోసారి చాటిచెప్పింది. ఈ అరుదైన కలయికకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.