* పల్లెల్లో పారిశ్రామిక విప్లవం: మోదీ సర్కార్ అమలు చేస్తున్న ఆ ‘సరికొత్త వ్యూహం’ ఇదే..! *
భారతదేశ గ్రామీణ రూపురేఖలను మార్చి, ప్రతి గ్రామాన్ని ఒక స్టార్టప్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగవంతమైన అడుగులు కొనసాగిస్తుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వ దార్శనికత అయిన ”సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్” అంటే అందరి సహకారంతో, అందరి అభివృద్ధిని సాధిస్తూ, అందరి విశ్వాసాన్ని పొందుతూ, అందరి సమష్టి కృషితో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమనే స్ఫూర్తితో ‘స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్’ ఎస్.వి.ఈ.పి గ్రామీణ సాధికారతకు, ఆర్థిక స్వావలంబనకు బలమైన బాటలు వేస్తోంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, దీనదయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద అమలవుతున్న ఈ పథకం ద్వారా అట్టడుగు వర్గాలకు చెందిన గ్రామీణ యువత, మహిళలు విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు.
సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకుపోతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడంలో ఎస్.వి.ఈ.పి అత్యుత్తమ ఫలితాలను సాధిస్తోంది. కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం, ఫిబ్రవరి 2026 నాటికి దేశవ్యాప్తంగా 4.32 లక్షల రూరల్ ఎంటర్‌ప్రైజెస్ కు సాధికారత లభించింది. జూన్ 30, 2026 నాటి నివేదికల అంచనా ప్రకారం కూడా అదే 4.32 లక్షల సంస్థలకు విజయవంతంగా మద్దతు అందింది. ఈ పథకం సోషల్ ఇన్ క్లూజన్ పై ప్రత్యేక దృష్టి సారించింది; ఇందులో దాదాపు 86% మంది పారిశ్రామికవేత్తలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు మైనారిటీ వర్గాలకు చెందినవారు కావడం విశేషం. మద్దతు పొందిన ఈ వ్యాపారాలలో 99% లాభదాయకంగా నడుస్తుండగా, సంబంధిత పారిశ్రామికవేత్తల కుటుంబాల మొత్తం ఆదాయంలో 57% వాటా కేవలం ఈ సంస్థల ద్వారానే సమకూరుతోంది. వ్యవసాయేతర రంగంలో చిన్నపాటి వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా స్వయం సహాయక బృందాలకు అండగా నిలుస్తున్న ఈ పథకం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో అద్భుతమైన మార్పును తీసుకువస్తోంది.ముఖ్యంగా ఈ ప్రగతిని మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో కో-ఆర్డినేట్ చేసుకుంటూ, వారి పూర్తి భాగస్వామ్యంతో ఈ పథకాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అంటే సెర్ప్ ఆధ్వర్యంలో 2016 నుండి ఈ పథకం చురుకుగా అమలు చేయబడుతోంది. మొదటి దశలో 2016 – 2019 సంవత్సరాలలో నాగర్‌కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి, ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలాల్లో ఈ పథకాన్ని మొదటగా ప్రవేశపెట్టారు. రెండవ దశలో 2020 – 2023 మధ్య ఈ కార్యక్రమాన్ని రంగారెడ్డిలో ఆమనగల్లు, భద్రాద్రి కొత్తగూడెంలో చండ్రుగొండ, నల్గొండలో దేవరకొండ, మహబూబ్ నగర్లో మక్తల్, సంగారెడ్డిలో నారాయణఖేడ్ లకు విస్తరించారు. ఎంపిక చేసిన కొన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన వ్యాపార యూనిట్లను పరిశీలిస్తే—ఏటూరునాగారంలో 1,493, నారాయణఖేడ్‌లో 970, ఆమనగల్లులో 911 చిన్న తరహా వ్యాపారాలు విజయవంతంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ నివేదికల ఆధారంగా, వివిధ సామాజిక వర్గాలకు చెందిన 1,979 వ్యాపార యూనిట్లకు తెలంగాణలో సుమారు రూ. 7.11 కోట్ల ఆర్థిక మద్దతు అందించబడింది. అధికారిక వివరాల ప్రకారం, ఫిబ్రవరి 2026 నాటికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అక్షరాలా 19,602 ఎంటర్‌ప్రైజెస్‌కు ఎస్.వి.ఈ.పి అండగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సమన్వయం చేసుకుంటూ.. మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా ఎస్.వి.ఈ.పి ని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. కేరళకు చెందిన కుడుంబ శ్రీ నేషనల్ రీసోర్స్ ఆర్గనైజేషన్ తో చేసుకున్న భాగస్వామ్య ఒప్పందం ద్వారా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌లకు శిక్షణ అందిస్తున్నారు. ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, నరసన్నపేట; పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు; మరియు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం బ్లాక్‌లలో మొదటగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రాజెక్టుల అమలు నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తంగా 58.6863 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి, తన వాటాను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14 మండలాల్లో కేంద్రం ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో 27,651 కు పైగా నానో, సూక్ష్మ వ్యాపారాలకు మద్దతు లభించగా, ఫిబ్రవరి 2026 నాటి అధికారిక గణాంకాల ప్రకారం ఆ సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో 27,692 కి చేరుకుంది. దీనికి తోడుగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్ శక్తి’ తదితర కార్యక్రమాల ద్వారా జెండర్-బడ్జెట్‌ను ప్రవేశపెట్టి మహిళల ఆర్థిక స్వావలంబనకు మరింత ప్రోత్సాహం అందిస్తోంది.
గ్రామీణ పేదలు కేవలం వ్యవసాయ కూలీలుగానే మిగిలిపోకుండా, లేదా ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లకుండా అరికట్టడంలో స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ ఒక నిర్మాణాత్మక పరిష్కారాన్ని చూపుతోంది. ముఖ్యంగా యువత మరియు మహిళలను మొదటి తరం పారిశ్రామికవేత్తలుగా మారుస్తూ గౌరవప్రదమైన కెరీర్‌ను ఇది అందిస్తోంది. సమ్మిళిత అభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్న ఈ పథకం, దీర్ఘకాలికంగా దేశంలో 1 కోటి గ్రామ సంస్థలకు మద్దతు ఇస్తూ 2 కోట్ల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించాలనే సువిశాల లక్ష్యంతో ముందుకు సాగుతూ, ‘ఆత్మనిర్భర్ భారత్’ నిర్మాణంలో ఒక కీ డ్రైవింగ్ శక్తిగా ఆవిర్భవిస్తోంది.
(శివ కుమార్ గనివాడ, సీనియర్ వ్యవసాయ, వాణిజ్య నిపుణులు)






