న్యూఢిల్లీ | 30 జూలై 2026
హైదరాబాద్ మురుగునీటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి అమృత్ 2.0 కింద కేంద్ర సహాయం అందించాలని పార్లమెంటరీ కమిటీ సమావేశంలో కోరిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
భువనగిరి లోక్‌సభ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు పార్లమెంట్ గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల స్థాయి సంఘం (Standing Committee on Housing and Urban Affairs) 22వ సమావేశంలో పాల్గొన్నారు. “అటల్ మిషన్ ఫర్ రీజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (AMRUT & AMRUT 2.0) కింద నగరాల్లో మురుగునీటి మరియు సెప్టేజ్ నిర్వహణ సమీక్ష” అంశంపై రూపొందించిన ముసాయిదా నివేదికను కమిటీ ఆమోదించింది. ఈ సమావేశానికి కమిటీ ఛైర్మన్ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షత వహించగా, ఇతర సభ్యులు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నగర మురుగునీటి వ్యవస్థ బలోపేతానికి సంబంధించిన కీలక ప్రతిపాదనలను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.
హైదరాబాద్‌లోని మూసీ నది వెంబడి 55 కిలోమీటర్ల పొడవున శుద్ధి చేయని మురుగునీరు నదిలో కలవకుండా అడ్డుకునే ట్రంక్ సీవర్ మెయిన్ ప్రాజెక్టును హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) ప్రతిపాదించిందని, సుమారు ₹4,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును అమృత్ 2.0 పథకం కింద చేర్చి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అలాగే, హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న 27 పట్టణ స్థానిక సంస్థలు (ULBs) మరియు ఔటర్ రింగ్ రోడ్ (ORR) వరకు మురుగునీటి సదుపాయాలను విస్తరించే లక్ష్యంతో సమగ్ర సీవరేజ్ మాస్టర్ ప్లాన్ (Comprehensive Sewerage Master Plan – CSMP) ను అమలు చేయాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. ఈ ప్రణాళికలో 7,444 కిలోమీటర్ల ట్రంక్ మెయిన్లు మరియు లేటరల్ సీవర్ నెట్‌వర్క్ నిర్మాణం ప్రతిపాదించబడిందని తెలిపారు.
ఈ సమగ్ర సీవరేజ్ మాస్టర్ ప్లాన్ అమలుకు ₹17,212.69 కోట్ల కేంద్ర ఆర్థిక సహాయం మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదించిందని పేర్కొంటూ, ఈ ప్రాజెక్టును అమృత్ 2.0 కింద లేదా ప్రత్యేక కేంద్ర ప్రాజెక్టుగా పరిగణించి ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మురుగునీటి మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యంత కీలకమని, దీనివల్ల మూసీ నది కాలుష్య నియంత్రణ, ప్రజారోగ్య పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణతో పాటు హైదరాబాద్ మహానగర ప్రాంతంలో సుస్థిర పట్టణాభివృద్ధికి బలమైన పునాది ఏర్పడుతుందని శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.







