Mahaa Daily Exclusive

  సీఈసీ నియామక చట్టంపై తీర్పు రిజర్వు…

Share

సీఈసీ నియామక చట్టంపై తీర్పు రిజర్వు.
• విస్తృత ధర్మాసనానికి పంపాలా?.. సుప్రీంకోర్టు నిర్ణయం పెండింగ్
ఢిల్లీ, మహా.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ)తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ వ్యవహారాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి పంపించాలా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. సీఈసీ నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తికి (సీజేఐ) స్థానం కల్పించకపోవడాన్ని ప్రశ్నిస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2023 చట్టాన్ని సమర్థిస్తూ తన వాదనలు వినిపించింది. కొత్త చట్టం వల్ల ఎన్నికల కమిషన్ స్వయంప్రతిపత్తికి ఎలాంటి భంగం కలగదని, ప్రధాని ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తారని ముందుగానే భావించడం సరికాదని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆర్టికల్ 324(2) ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకాలపై చట్టం చేసే అధికారం పార్లమెంట్‌కు రాజ్యాంగం కల్పించిందని, నియామక కమిటీలో ప్రధాన న్యాయమూర్తి తప్పనిసరిగా ఉండాలనే నిబంధన రాజ్యాంగంలో ఎక్కడా లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఎన్నికల కమిషనర్లకు కల్పించిన పదవీ భద్రతే కమిషన్ స్వతంత్రతకు ప్రధాన ఆధారమని తన అఫిడవిట్‌లో పేర్కొంది.

పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ, నియామక కమిటీ నుంచి సీజేఐని తొలగించడం ప్రజాస్వామ్య సూత్రాలకు, సంస్థల స్వతంత్రతకు విరుద్ధమని తెలిపారు. ఈ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా స్పందిస్తూ, న్యాయం జరగడమే కాకుండా అది పారదర్శకంగా జరిగినట్లు ప్రజలకు కనిపించడం కూడా అంతే ముఖ్యమని వ్యాఖ్యానించారు.

2023 చట్టం ప్రకారం సీఈసీ, ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, ఆయన నామినేట్ చేసిన ఒక కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నేత లేదా లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తికి స్థానం కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్)తో పాటు మరికొందరు సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ అంశంపై ద్విసభ్య ధర్మాసనం ఇచ్చే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.