Mahaa Daily Exclusive

  బీఆర్‌ఎస్‌ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు…..

Share

  • బీఆర్‌ఎస్‌ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు
  • కేసీఆర్‌ కుటుంబానిది అంతా నటన
  • పాత పార్టీకే దిక్కులేదు: సీఎం ఎద్దేవా

హైదరాబాద్, మహా.
హైదరాబాద్‌ అసెంబ్లీ ప్రాంగణం సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీపై, కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత రాష్ట్ర సమితికి గతం మాత్రమే ఉందని, భవిష్యత్తు లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారన్న వార్తలపై స్పందిస్తూ.. అసలు ఉన్న పార్టీయే ఉంటుందో ఊడుతుందో తెలియని స్థితిలో, కొత్త పార్టీ గురించి చర్చించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ లక్ష్యం ఎప్పుడో నెరవేరిపోయిందని, ఇప్పుడు ఆ పార్టీ చనిపోయిన శవంతో సమానమని ముఖ్యమంత్రి అత్యంత ఘాటుగా విమర్శించారు. శవానికి ఎంత అలంకరణ చేసినా తిరిగి ప్రాణం రాదని, అలాగే బీఆర్‌ఎస్‌ను మళ్లీ ప్రజలు ఆదరించరని స్పష్టం చేశారు.
కేసీఆర్‌ కుటుంబ సభ్యుల తీరును రేవంత్‌రెడ్డి తీవ్రంగా తూర్పారబట్టారు. ఆ కుటుంబానికి ప్రజలతో ఎలాంటి సంబంధం లేదని, ప్రస్తుతం వాళ్లంతా కలిసి ఒక కృత్రిమ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారని విమర్శించారు. ఆ కుటుంబమంతా ఒక్కటేనని, వారికి రంగు, రుచి లేవని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారు ఎలా మాట్లాడినా ప్రజలు సహించారని, పదేళ్ల అధికారం ఉన్నప్పుడు కూడా అదే తరహాలో ప్రవర్తించారని గుర్తు చేశారు. కేసీఆర్‌ ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ఆయన ఆరోగ్యంగా ఉండటమే తమకు కావాలని, కేసీఆర్‌ ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న ఒక సాధారణ ప్రజాప్రతినిధి మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఆయన మనిషో లేక మర మనిషో ఆయన కుటుంబ సభ్యులకే తెలియాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కేసీఆర్ కుటుంబం అధికారానికి దూరమైన బాధలో ఇదంతా చేస్తోందని, ప్రజలు వారిని ఎప్పుడో విస్మరించారని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అసలు పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంలో పడేసి, కవిత కొత్త ప్రత్యామ్నాయం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు.