*జనగణన గుప్పిట్లో ఉపాధ్యాయుల బదిలీలు
*టీచర్ల స్థానచలనానికి కేంద్ర నిబంధనల అడ్డంకి
*మే నెలలో ప్రక్రియపై వీడని ఉత్కంఠ.
*జులై వైపు ఉపాధ్యాయ సంఘాల మొగ్గు
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రంలో సాధారణ బదిలీలపై నిషేధం తొలగించినప్పటికీ, ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారం ఇప్పుడు ఒక చిక్కుముడిగా మారింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం బదిలీల ప్రక్రియను చేపట్టాలని భావిస్తుండగా, మరోవైపు దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న జనగణన (జనాభా లెక్కల సేకరణ) విధులు ఉపాధ్యాయులను కట్టిపడేస్తున్నాయి. రాష్ట్రంలోని సుమారు 70 నుంచి 80 శాతం మంది ఉపాధ్యాయులు ఈ కీలకమైన విధుల్లో పాల్గొనాల్సి ఉండటంతో, ప్రస్తుతం బదిలీలు నిర్వహిస్తే జనగణన ప్రక్రియకు ఆటంకం కలుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మే 11 నుంచి జూన్ 9 వరకు మొదటి విడత ఇళ్ల గణన జరగనున్న నేపథ్యంలో, ఈ సమయంలో బదిలీలు చేపట్టడం సాంకేతికంగా అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి.
**కేంద్రం నిబంధనలు.. రాష్ట్ర విద్యాశాఖ సందిగ్ధం**
జనగణన విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులను 2027 మార్చి వరకు బదిలీ చేయవద్దని కేంద్ర హోంశాఖ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తొలి విడతలో ఇళ్ల వివరాలు సేకరించిన వారే, 2027 ఫిబ్రవరిలో నిర్వహించే తుది విడత గణనలో పాల్గొనాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం మధ్యలో సిబ్బందిని మారిస్తే గణాంకాల్లో వ్యత్యాసాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ జూన్ 9 తర్వాత బదిలీలు చేపట్టినా, ఉపాధ్యాయులు ఇతర మండలాలకు లేదా దూర ప్రాంతాలకు వెళ్లిపోతే, తిరిగి పాత చోట జనగణన విధులకు హాజరుకావడం ఆచరణాత్మకంగా ఇబ్బందికరంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే బదిలీల ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి.
**జులైపైనే ఆశలు.. పదోన్నతుల డిమాండ్**
మరోవైపు ఉపాధ్యాయ సంఘాల ఐకాస నేతలు ఈ సమస్యకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. 2018 జులైలో జరిగిన బదిలీల ప్రకారం, ఈ ఏడాది జులై 14 నాటికి ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తవుతుంది. అంటే అప్పటికి ఉపాధ్యాయులు తప్పనిసరి బదిలీ (కంపల్సరీ ట్రాన్స్ఫర్) పరిధిలోకి వస్తారు. అందుకే మే నెలలో హడావుడిగా కాకుండా, జులై 31ని కటాఫ్ తేదీగా నిర్ణయించి బదిలీలతో పాటు పదోన్నతులు కూడా కల్పించాలని దామోదర్ రెడ్డి, చావ రవి, సదానందం గౌడ్ వంటి నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పటికి టెట్ ఫలితాలు కూడా వెలువడతాయని, తద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. 2011లో కూడా తొలి విడత జనగణన తర్వాతే బదిలీలు జరిగాయని వారు గుర్తు చేస్తున్నారు.
**కోర్టు మెట్లెక్కే అవకాశం?**
విద్యాశాఖ అధికారులు మాత్రం బదిలీలపై తుది నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేశారు. మే నెలలో బదిలీలు చేస్తే ఎంత మందికి ప్రయోజనం కలుగుతుంది, గతంలో ఎప్పుడు పదోన్నతులు ఇచ్చారు అనే డేటాను మాత్రమే ప్రభుత్వానికి నివేదించారు. అయితే, జనగణన విధుల్లో ఉండగా బదిలీలు చేయడంపై కొందరు ఉపాధ్యాయులు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా అధిక హెచ్ఆర్ఏ ప్రాంతాల్లో ఉన్న వారు బదిలీలను వ్యతిరేకించే అవకాశం ఉంది. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఈ గందరగోళానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది.








