Mahaa Daily Exclusive

  మంత్రి ఉత్తమ్ పేరుతో భారీ మోసం…..

Share

*మంత్రి ఉత్తమ్ పేరుతో భారీ మోసం.
* రూ.1.70 కోట్లు మాయం
*ప్రాజెక్టు ఇప్పిస్తానని ప్రలోభం..కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు
*వ్యాపారి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసుల దర్యాప్తు
హైదరాబాద్, మహా.
ఉన్నత స్థాయి మంత్రుల పేర్లు చెప్పుకుని అమాయక వ్యాపారులను దోచుకుంటున్న కేటుగాళ్ల ఆగడాలు నగరంలో కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నలమడ ఉత్తమ్ కుమార్ రెడ్డితో తనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నమ్మించి, ఓ వ్యాపారి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన విస్తుపోయే ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రాజెక్టు ఇప్పిస్తానని నమ్మబలికిన సదరు నిందితుడు ఏకంగా రూ.1.70 కోట్ల నగదుతో పాటు కారు, ఖరీదైన ఫోన్లను కాజేయడం చర్చనీయాంశమైంది.
**నమ్మించి వంచించిన ‘బంగారు యాదవ్’**
పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో గ్రీన్ మెట్రో ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థ డైరెక్టర్ బొడ్డు అశోక్‌కు దుండిగల్ ప్రాంతంలో ఒక భారీ ప్రాజెక్టును దక్కించుకోవాలనే ఆలోచన ఉంది. ఈ విషయాన్ని పసిగట్టిన పురిమెట్ల బంగారు యాదవ్ అనే వ్యక్తి అశోక్‌ను కలిశాడు. తనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో విడదీయరాని సంబంధాలు ఉన్నాయని, ఆయనతో మాట్లాడి దుండిగల్ ప్రాజెక్టును మీ సంస్థకే దక్కేలా చూస్తానని అశోక్‌ను నమ్మించాడు. ప్రభుత్వ పెద్దల పేర్లను నిందితుడు అత్యంత చాకచక్యంగా వాడటంతో బాధితుడు అది నిజమేనని భావించాడు.
**నగదు, కారు.. ఐఫోన్.. అంతా దోపిడీయే**
ప్రాజెక్టు ఇప్పించడానికి ఖర్చుల కోసం అంటూ నిందితుడు వివిధ దఫాలుగా అశోక్ నుంచి ఏకంగా రూ.1.70 కోట్ల నగదును వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా తన హోదాకు తగినట్లుగా ఉండాలంటూ ఒక ఖరీదైన ఐఫోన్‌ను, ప్రయాణాల కోసం ఒక హ్యుందాయ్ ‘అల్కజర్’ కారును కూడా బాధితుడి నుంచి తీసుకున్నాడు. డబ్బులు, ఇతర విలాసవంతమైన వస్తువులు చేతికి అందాక నిందితుడు కాలయాపన మొదలుపెట్టాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 18 నెలల పాటు ప్రాజెక్టు పనులు ఇప్పిస్తానంటూ సాకులు చెబుతూ తిప్పించుకున్నాడు.
**చివరకు కటకటాల్లోకి..**
గడువు ముగిసినా ప్రాజెక్టు విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడం, నిందితుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో బాధితుడు అశోక్ ఆరా తీశాడు. చివరకు తాను మోసపోయానని గ్రహించి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడు పురిమెట్ల బంగారు యాదవ్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ మోసంలో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా? గతంలో ఎవరినైనా ఇలాగే మోసం చేశాడా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. మంత్రులు లేదా ఉన్నతాధికారుల పేర్లు చెప్పి ఇలాంటి ప్రలోభాలకు గురిచేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తున్నారు.