Mahaa Daily Exclusive

  తెలంగాణ పౌరుషం బీఆర్ఎస్ వల్లే సాధ్యం..

Share

  • తెలంగాణ పౌరుషం బీఆర్ఎస్ వల్లే సాధ్యం
  • ఢిల్లీ వేదికగా రాష్ట్ర ఆత్మగౌరవం తాకట్టు.
  • ఎంపీల తీరుపై గులాబీ అధినేత నిప్పులు
  • ఇది ‘బొందలగడ్డ’ ప్రభుత్వం.
  • రైతు గోడు పట్టని చేతకాని పాలన
  • గులాబీ కోట పునర్నిర్మాణం
  • పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం

**హైదరాబాద్, ఏప్రిల్ 27:**

ఢిల్లీ వీధుల్లో తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పడుతోందని, పార్లమెంట్‌లో మన గొంతు లేకపోవడం వల్లే ‘వెధవలు’ కూడా రాష్ట్రాన్ని అవమానిస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై నోరు మెదపని రాష్ట్ర ఎంపీల తీరును తీవ్రంగా ఆక్షేపిస్తూ, తెలంగాణ పౌరుషం కేవలం బీఆర్ఎస్‌తోనే సాధ్యమని ఉద్ఘాటించారు.

హైదరాబాద్ నగరంలోని పార్టీ ప్రధాన కార్యాలయం ‘తెలంగాణ భవన్’లో సోమవారం రజతోత్సవ ముగింపు వేడుకలు అంబరాన్నంటాయి. ఈ చారిత్రక ఘట్టానికి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్య అతిథిగా హాజరై, గులాబీ జెండాను ఆవిష్కరించి సమరశంఖం పూరించారు. తొలుత ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో నివాళులర్పించారు. మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస యాదవ్ వంటి సీనియర్ నేతలు ఆయన వెంటే ఉండి నివాళులర్పించగా, ప్రాంగణమంతా ‘జై తెలంగాణ.. జై కేసీఆర్’ నినాదాలతో హోరెత్తింది. ఈ సందర్భంగా జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ పార్టీ పునర్నిర్మాణంపై అత్యంత కీలకమైన నిర్ణయాలు ప్రకటించి శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు.
పార్టీని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర స్థాయి కమిటీ మినహా, ప్రస్తుతం ఉన్న అన్ని విభాగాల కమిటీలను తక్షణమే రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. క్షేత్రస్థాయి నుంచి కొత్త రక్తాన్ని నింపేలా త్వరలోనే నూతన కమిటీలను నియమించాలని, వారికి సమగ్రమైన శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కీలక బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అప్పగిస్తూ, పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఉధృతం చేయాలని ఆదేశించారు. అటు ఆన్‌లైన్, ఇటు ఆఫ్‌లైన్ విధానాల్లో ప్రతి ఇంటికీ గులాబీ జెండా చేరువ కావాలని పిలుపునిచ్చారు. ఇదే వేదికపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ, ఆయనను కార్యవర్గానికి పరిచయం చేశారు.
రాజకీయ ప్రసంగంలో భాగంగా కేసీఆర్ ఢిల్లీ పీఠంపై, కేంద్రంలోని బీజేపీ ఎంపీల వైఖరిపై విరుచుకుపడ్డారు. పార్లమెంట్‌లో డీలిమిటేషన్ చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. భారత్-పాకిస్థాన్ విభజనతో తెలంగాణ ఏర్పాటును పోల్చిన ఆ ఎంపీని ‘పెద్ద వెధవ’గా అభివర్ణిస్తూ, అప్పుడు సభలో ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా 16 మంది ఎంపీలు మౌనంగా ఉండటం రాష్ట్రానికే సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ పౌరుషం లేని వారు ఎంపీలుగా ఉంటే రాష్ట్ర ఆత్మగౌరవం దిల్లీ వీధుల్లో తాకట్టు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే గనుక బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉండి ఉంటే రణరంగం సృష్టించి, ఆ ఎంపీతో క్షమాపణ చెప్పించేవారమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కోసం తాను అనుభవించిన మానసిక క్షోభను, కొట్లాడి సాధించిన విజయాలను ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ విమర్శల దాడిని మరింత పెంచారు. ఒకప్పుడు అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ, నేడు ‘బొందలగడ్డ’గా మారుతోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. అంబెడ్కర్ విగ్రహం గడప తొక్కేందుకు కూడా ప్రజలను అనుమతించని ఈ ప్రభుత్వాన్ని ‘చండాలమైన, చిల్లర ప్రభుత్వం’గా అభివర్ణించారు. ముఖ్యమంత్రి, మంత్రుల భాషను చూస్తుంటే జాలి వేస్తోందని, ప్రజల సమస్యలను పరిష్కరించడం చేతకాక చిల్లర కూతలు కూస్తున్నారని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు చేయలేని చేతకానితనంతో రైతులను గోస పెడుతున్నారని, గడిచిన పదేళ్లలో రైతును రాజును చేస్తే, నేడు మళ్లీ రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అశోక్ గులాటీ వంటి మిత్రుల సలహాతో తెచ్చిన రైతుబంధు పథకాన్ని నీరుగార్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ చేసిన ఈ సుదీర్ఘ ప్రసంగం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ప్రతిపక్షంగా తమ పాత్రను సమర్థవంతంగా పోషిస్తామని, ప్రజా సమస్యలపై పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేటీఆర్ సారథ్యంలో రాబోయే కమిటీలు, శిక్షణా తరగతులు పార్టీని ఎన్నికల యంత్రంలా తీర్చిదిద్దుతాయని నమ్మకం ప్రకటించారు. గతం ఘనం.. భవిష్యత్తు మనదే అన్న ఆశాభావంతో కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.