Mahaa Daily Exclusive

  భారత్ ఫ్యూచర్ సిటీకి హైస్పీడ్ జోష్…

Share

*భారత్ ఫ్యూచర్ సిటీకి హైస్పీడ్ జోష్.
*’రైల్వే కారిడార్ల హబ్ గా భాగ్యనగరం**
*ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలతో బుల్లెట్ వేగంతో అనుసంధానం.
*జూన్ 2న సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభం.
* మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి రవాణా వ్యవస్థలతో అనుసంధానించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని హైస్పీడ్ రైల్ కారిడార్ల హబ్ గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ మొదలైంది. సోమవారం సచివాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నుండి ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలను బుల్లెట్ రైలు వేగంతో అనుసంధానించడంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
హైదరాబాద్ – పూణే – ముంబై మధ్య ప్రతిపాదించిన హైస్పీడ్ రైల్వే కారిడార్ కు సంబంధించి ఇప్పటికే డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) పూర్తయింది. మొత్తం 761 కిలోమీటర్ల మేర సాగే ఈ మార్గంలో 12 స్టేషన్లు ఉండగా, అందులో 10 ఎలివేటెడ్ మరియు 2 అండర్ గ్రౌండ్ స్టేషన్లుగా నిర్మించనున్నారు. ఈ రైలు గంటకు 330 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, నాన్ స్టాప్ గా వెళ్తే కేవలం 2 గంటల 55 నిమిషాల్లోనే ముంబై చేరుకునేలా ప్లాన్ చేశారు. వికారాబాద్ సమీపంలో సుమారు 4.6 కిలోమీటర్ల మేర నిర్మించనున్న టన్నెల్ అంశంపై ముఖ్యమంత్రితో చర్చించి వేగంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.
మరోవైపు భారత్ ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి మీదుగా చెన్నైకి, అలాగే బెంగళూరుకు హైస్పీడ్ కనెక్టివిటీ కల్పించేందుకు సర్వేలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుల పట్ల సానుకూలంగా ఉందని, రెండు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ఈ హైస్పీడ్ కారిడార్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభివర్ణించారు.
రవాణా రంగంతో పాటు ప్రజారోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించేందుకు పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేలా వరంగల్ ఆసుపత్రి పనుల పురోగతిపై కూడా ఆయన ఆరా తీశారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బి స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ తో పాటు పలువురు రైల్వే మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.