Mahaa Daily Exclusive

  కాళేశ్వరంపై సీబీఐ పంజా…

Share

* విచారణకు ఒత్తిడి పెంచాలని సర్కార్ నిర్ణయం.
*అడ్డంకులు తొలగాయి.. ఇక విచారణే తరువాయి.
* న్యాయ నిపుణులతో సీఎం సమీక్ష.
*దిల్లీ బాటలో మంత్రులు.
* కాళేశ్వరం అవినీతిపై సీబీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదుకు సన్నద్ధం.
హైదరాబాద్, మహా.
**హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించే దిశగా తెలంగాణ ప్రభుత్వం తన కార్యాచరణను మరింత తీవ్రతరం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు లేఖ రాయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అవసరమైతే రాష్ట్ర మంత్రుల బృందం నేరుగా దిల్లీకి వెళ్లి సీబీఐ డైరెక్టర్‌ను కలిసి, సమగ్ర వినతిపత్రం సమర్పించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో, తదుపరి చేపట్టాల్సిన చట్టపరమైన చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.**
ఈ కీలక సమావేశంలో సుప్రీం కోర్టు ప్రముఖ న్యాయ నిపుణులు అభిషేక్ సింఘ్వీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం కాళేశ్వరం అంశంపై ఏ కోర్టులోనూ ఎటువంటి స్టేలు గానీ, పెండింగ్ కేసులు గానీ లేవని న్యాయ నిపుణులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను లేదా కమిషన్ ఏర్పాటును హైకోర్టు ఎక్కడా తప్పు పట్టలేదని, ఆ ప్రక్రియ అంతా చట్టబద్ధంగానే ఉందని వారు వివరించారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ కోరడానికి ఎలాంటి చట్టపరమైన ఆటంకాలు లేవని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది.
గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు రీ-డిజైనింగ్ పేరుతో జరిగిన భారీ కుంభకోణంపై లోతైన విచారణ జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ ద్వారా సేకరించిన ప్రాథమిక ఆధారాలు, నివేదికలను సీబీఐకి అందజేయాలని నిర్ణయించారు. ఈ వ్యవహారంలో దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ప్రజాధనం వృథా కావడానికి కారకులైన వారిని చట్టం ముందు నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీని కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సీబీఐతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సెక్రటరీ మాణిక్ రాజ్, ఇరిగేషన్ ఈఎన్సీ శ్రీధర్ , ప్రభుత్వ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.