- కాంగ్రెస్ పాలనలో కులవృత్తులు ఆగం!
- మత్స్యకారులను దారుణంగా మోసం చేసిన రేవంత్ సర్కార్: హరీశ్ రావు
- కామారెడ్డి డిక్లరేషన్‌ను గాలికొదిలేశారు: బండ ప్రకాష్
- బీఆర్ఎస్లోకి భారీగా రామాయంపేట ముదిరాజ్ నేతల చేరిక
రామాయంపేట,మహా.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులవృత్తులు, చేతివృత్తులను పూర్తిగా చిన్నచూపు చూస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. మత్స్యకారులను రేవంత్ సర్కార్ దారుణంగా మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలానికి చెందిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వంద మందికి పైగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరీశ్ రావు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
చేప పిల్లల పంపిణీ ఏదీ?
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో మత్స్యకారుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసి వలలు, మోపెడ్లు, త్రీ వీలర్స్ అందించిందని గుర్తు చేశారు. నాలుగు వేల కొత్త సొసైటీలు ఏర్పాటు చేసి, నాలుగు లక్షల మందికి కొత్త సభ్యత్వాలతో పాటు ఉచిత బీమా సౌకర్యం కల్పించామన్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం ఏకంగా రూ. 850 కోట్లు వెచ్చించామని, ఎండాకాలంలోనే టెండర్లు పూర్తి చేసి వర్షాలు పడే నాటికి చేప పిల్లలను సిద్ధంగా ఉంచేవాళ్లమని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల టెండర్లు ఆలస్యమై గత రెండేళ్లుగా చేప పిల్లల పంపిణీ జరగలేదని, దీంతో మత్స్యకారుల ఉపాధి తీవ్రంగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజ్‌లను బీసీ ఏలో చేరుస్తామని, బీసీలకు సబ్ ప్లాన్, 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మోసం చేసిందన్నారు. కోకాపేటలో కులవృత్తుల ఆత్మగౌరవ భవనాలకు కేసీఆర్ స్థలాలు కేటాయిస్తే, ఈ రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వక పనులన్నీ నిలిచిపోయాయని విమర్శించారు. గొర్రెల పంపిణీ, చేనేతలకు రసాయనాల సబ్సిడీ లాంటి అద్భుతమైన పథకాలను నిలిపివేశారని, ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వల్లే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా స్వచ్ఛందంగా బీఆర్ఎస్లోకి వస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ మళ్లీ ఎప్పుడు వస్తారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
బీసీలకు నిధుల కేటాయింపులో వంచన
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ.. కేసీఆర్, హరీశ్ రావుల సహకారంతో మూడు ఎకరాల్లో రూ. 8 కోట్లతో ముదిరాజ్‌లకు ఏసీ భవనం నిర్మించుకున్నామని తెలిపారు. మెదక్, జహీరాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి సహా రాష్ట్రవ్యాప్తంగా 20కి పైగా పట్టణాల్లో ముదిరాజ్ భవనాలకు స్థలాలు కేటాయించుకోగా, ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీ సబ్ ప్లాన్‌ను ఆరు నెలల్లో అమలు చేస్తామని చెప్పి.. రెండు సంవత్సరాల నాలుగు నెలలు దాటినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రెండేళ్ల బడ్జెట్లో బీసీలకు రూ. 21 వేల కోట్లు కేటాయించినట్లు చూపి, కేవలం రూ. 4 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి బీసీలను దారుణంగా వంచించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ కులాలకు కొత్త ఫెడరేషన్లు ఏర్పాటు చేసి, ఒక్కో దానికి రూ. 50 కోట్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని, ఆ ఫెడరేషన్ల చైర్మన్ల జీతాలు కూడా వేరే కార్పొరేషన్ నుంచి తెచ్చి ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కామారెడ్డి డిక్లరేషన్‌ను వంద శాతం అమలు చేయాలని, ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లోకి మార్చేందుకు వెంటనే కార్యాచరణ ప్రకటించాలని బండ ప్రకాష్ డిమాండ్ చేశారు.
ఈ చేరికల కార్యక్రమంలో మెదక్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కంఠం రెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సుప్రభాత రావు తేందర్, మాజీ ఎంపీపీ పుట్టి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.








