కేరళం పేరు మార్పు బిల్లు.
• ట్రిబ్యునళ్ల సంస్కరణలకు కేంద్రం శ్రీకారం.
* పార్లమెంట్లో సోమవారం ఆరు కీలక బిల్లులు.
ఢిల్లీ, మహా.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి దశలో కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. సోమవారం లోక్‌సభ, రాజ్యసభల్లో మొత్తం ఆరు ముఖ్యమైన బిల్లులు చర్చకు రానున్నాయి. కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చే బిల్లుతో పాటు ట్రిబ్యునళ్ల సంస్కరణలు, గనులు–ఖనిజాల చట్ట సవరణ, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ చట్ట సవరణ, బ్యాంకింగ్ రికార్డుల ఆధునీకరణ, పన్నులు–ఇతర చట్టాల సవరణలు ఇందులో ఉన్నాయి. దీంతో సోమవారం పార్లమెంట్ శాసన కార్యక్రమం కీలకంగా మారింది.
‘కేరళ’ ఇక ‘కేరళం’?
రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చేందుకు ఉద్దేశించిన కేరళ (అల్టరేషన్ ఆఫ్ నేమ్) బిల్లు–2026ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. మలయాళంలో రాష్ట్రాన్ని ‘కేరళం’గా పిలుస్తున్నందున అదే పేరును అధికారికంగా గుర్తించాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఈ మేరకు 2024లో కేరళ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అనంతరం కేంద్ర స్థాయిలో ప్రక్రియ కొనసాగి.. ఇప్పుడు బిల్లు పార్లమెంట్ ముందుకు రానుంది.
రాష్ట్రం పేరు మార్పునకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్‌కు అధికారం ఉంది. అయితే సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని రాష్ట్రపతి కోరే రాజ్యాంగ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియలో భాగంగానే కేరళ శాసనసభ అభిప్రాయాన్ని కోరిన అనంతరం కేంద్రం తదుపరి చర్యలకు సిద్ధమైంది. బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాతే పేరు మార్పు చట్టబద్ధంగా అమల్లోకి వస్తుంది.
ట్రిబ్యునళ్లలో సంస్కరణలు
వివిధ ట్రిబ్యునళ్లలో చైర్పర్సన్లు, సభ్యుల నియామకాలు, వారి సేవా నిబంధనలను మరింత పారదర్శకంగా, సమర్థంగా మార్చే లక్ష్యంతో ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లు–2026ను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ట్రిబ్యునళ్ల పనితీరును మెరుగుపరచడం, నియామక ప్రక్రియలో స్పష్టత తీసుకురావడం వంటి అంశాలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
గనుల చట్టానికి సవరణలు
మిన్స్ అండ్ మినరల్స్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) అమెండ్మెంట్ బిల్లు–2026ను కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి సభ ముందుకు తీసుకురానున్నారు. 1957 నాటి గనులు, ఖనిజాల అభివృద్ధి–క్రమబద్ధీకరణ చట్టంలో మార్పులు చేయడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ఖనిజాల అన్వేషణ, గనుల అభివృద్ధి, వనరుల వినియోగానికి సంబంధించిన నిబంధనలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చే అంశాలు ఇందులో ఉండనున్నాయి.
సహకార రంగానికీ మార్పులు
జాతీయ సహకార అభివృద్ధి సంస్థకు సంబంధించిన ఎన్సీడీసీ చట్ట సవరణ బిల్లును కూడా అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. 1962 నాటి చట్టంలో మార్పులు చేయడం ద్వారా సహకార రంగానికి మరింత ఆర్థిక, సంస్థాగత మద్దతు అందించేలా వ్యవస్థను బలోపేతం చేయడం కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోంది.
డిజిటల్ బ్యాంకింగ్‌కు కొత్త చట్టం
రాజ్యసభలో బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు–2026 తదుపరి దశకు వెళ్లనుంది. బ్యాంకింగ్ రికార్డులకు సంబంధించిన 1891 నాటి చట్టాన్ని ఆధునీకరించి.. డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థకు అనుగుణంగా కొత్త న్యాయపరమైన చట్రాన్ని తీసుకురావడం దీని ఉద్దేశం. ఎలక్ట్రానిక్, డిజిటల్ రూపంలో ఉన్న బ్యాంకింగ్ రికార్డులకు న్యాయపరమైన సాక్ష్యంగా స్పష్టమైన గుర్తింపు కల్పించే అంశానికి ఇందులో ప్రాధాన్యం ఉంది.
ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన నేపథ్యంలో.. సోమవారం రాజ్యసభలో తదుపరి ప్రక్రియ చేపట్టనున్నారు.
పన్ను చట్టాల్లోనూ మార్పులు
టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్మెంట్) బిల్లు–2026 కూడా రాజ్యసభలో తదుపరి పరిశీలనకు రానుంది. పన్ను వ్యవస్థకు సంబంధించిన నిబంధనల్లో అవసరమైన మార్పులు చేయడంతో పాటు చెల్లింపులు, ఆర్థిక వ్యవస్థ, ఇతర సంబంధిత చట్టాల్లో సవరణలకు ఈ బిల్లు మార్గం సుగమం చేయనుంది. ఇది కూడా లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన నేపథ్యంలో ఎగువసభలో తదుపరి దశకు చేరుకుంది.
ఒకే రోజున ఆరు కీలక బిల్లులు పార్లమెంట్ ముందుకు రానుండటంతో సోమవారం శాసన కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా కేరళ పేరును ‘కేరళం’గా మార్చే ప్రతిపాదన దక్షిణాది రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుండగా.. ట్రిబ్యునళ్లు, గనులు, సహకార రంగం, బ్యాంకింగ్, పన్ను వ్యవస్థలకు సంబంధించిన ప్రతిపాదిత మార్పులు పరిపాలన, ఆర్థిక రంగాలపై ప్రభావం చూపే అవకాశముంది. ఈ బిల్లులపై ప్రతిపక్షాల వైఖరి, సభల్లో జరిగే చర్చలు ఎలా సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.






