యువతే వికసిత్ భారత్ నిర్మాతలు.
* కష్టాలను అధిగమించి లక్ష్యాలను సాధించాలి.
* నిరంతర అభ్యాసంతోనే మారుతున్న ప్రపంచంలో ముందంజ.
* ప్రధాని నరేంద్ర మోడీ.
ఢిల్లీ, మహా.
దేశ యువతను చూస్తే గర్వంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భవిష్యత్ భారతదేశ నిర్మాతలు యువతేనని, దేశం కలలు కంటున్న అభివృద్ధిని సాకారం చేసే బాధ్యత వారి భుజాలపై ఉందని పేర్కొన్నారు. జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదురవుతాయని, ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయకుండా లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. శనివారం ఐఐటీ ఢిల్లీ 57వ కాన్వొకేషన్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. పట్టభద్రులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
కాన్వొకేషన్ వేడుకలో విద్యార్థులతో ప్రధాని సరదాగా ముచ్చటించారు. ప్రస్తుతం వేడుకలో కూర్చున్నప్పటికీ ప్రతి ఒక్కరి మనసులో భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు తిరుగుతున్నాయని అన్నారు. ‘‘నేనేమీ బాబా బాగేశ్వర్ను కాదు.. మీ మనసులో ఏముందో చెప్పడానికి. కానీ ఏవో ఆలోచనలు మాత్రం తప్పకుండా ఉంటాయి’’ అంటూ చమత్కరించడంతో సభలో నవ్వులు పూశాయి. కొందరు తొలి ఉద్యోగం, తొలి జీతం కోసం ఎదురుచూస్తుండవచ్చని, మరికొందరు స్టార్టప్ ప్రారంభించాలని, ఇంకొందరు ఉన్నత విద్య లేదా పోటీ పరీక్షల వైపు అడుగులు వేయాలని భావిస్తుండవచ్చని చెప్పారు. లక్ష్యాలు వేర్వేరైనా ప్రతి ఒక్కరిలోనూ భవిష్యత్తుపై ఉత్సాహం ఒకేలా ఉందన్నారు.
ఐఐటీ ఢిల్లీలో అడుగుపెట్టిన రోజు నిన్ననే జరిగినట్లుగా అనిపిస్తుండగానే కాన్వొకేషన్ రోజు వచ్చేసిందని ప్రధాని గుర్తుచేశారు. నేటితో విద్యార్థుల జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందన్నారు. ప్రపంచ వ్యవస్థ వేగంగా మారుతోందని, సాంకేతికత ఈ మార్పులకు ప్రధాన కారణమని చెప్పారు. రాబోయే 20–30 ఏళ్లలో ప్రపంచం ఏ రూపం దాల్చుతుందో కచ్చితంగా అంచనా వేయడం కష్టమని, అయితే నిరంతరం కొత్త విషయాలను నేర్చుకునే వారు మాత్రమే ఈ మార్పులకు అనుగుణంగా ముందుకు సాగగలరని సూచించారు.
విజేతలకు పతకాలు అందజేసిన ప్రధాని.. పురస్కారాలు సాధించిన వారిలో బాలికల సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఒకరిద్దరితో పరిమితం కాకుండా మరింత మంది అమ్మాయిలు ఈ జాబితాలో ఉండాలని ఆకాంక్షించారు. విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని పరోక్షంగా సూచించారు.
స్వాతంత్య్ర పోరాటాన్ని ప్రస్తావించిన మోదీ.. ప్రతి తరానికి ఒక జాతీయ బాధ్యత ఉంటుందని అన్నారు. స్వాతంత్య్రానికి ముందు తరం దేశానికి స్వేచ్ఛ సాధించడమే లక్ష్యంగా ఎన్నో త్యాగాలు చేసిందని, వారి పోరాట ఫలితంగానే నేడు దేశ ప్రజలు స్వేచ్ఛను అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం ముందున్న సవాళ్లు భిన్నమైనవని, వాటిని అధిగమించే బాధ్యత నేటి తరంపై ఉందన్నారు.
రాబోయే 30–35 ఏళ్లలో విద్యార్థులు చేపట్టే ప్రతి పని ‘వికసిత్ భారత్’ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలతో పాటు దేశానికి ఏం మేలు జరుగుతుంది, దేశ అవసరాలను ఎలా తీర్చగలమన్న దానిని ప్రతి నిర్ణయంలో పరిగణనలోకి తీసుకోవాలని ఐఐటీయన్లకు సూచించారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువత చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు.






