Mahaa Daily Exclusive

  రైల్వేలో సౌర విద్యుత్‌కు మరో ముందడుగు…

Share

రైల్వేలో సౌర విద్యుత్‌కు మరో ముందడుగు.
• 7 కిలోవాట్‌ పీక్‌ సామర్థ్యంతో సోలార్‌ ప్లాంట్‌.
• ఒక్కో కోచ్‌కు ఏటా రూ.2.80 లక్షల ఆదా.

ప్రయాగ్‌రాజ్‌,మహా.

పర్యావరణహిత రైలు రవాణా దిశగా భారతీయ రైల్వే మరో కీలక అడుగు వేసింది. ఉత్తర మధ్య రైల్వేలోని ప్రయాగ్‌రాజ్‌ డివిజన్‌లో సౌర విద్యుత్‌తో పనిచేసే ప్యాసింజర్‌ కోచ్‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. కోచ్‌ పైకప్పుపై సుమారు 7 కిలోవాట్‌ పీక్‌ సామర్థ్యం కలిగిన సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా సంప్రదాయ విద్యుత్‌ ఉత్పత్తిపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు విద్యుత్‌ ఖర్చును ఆదా చేయాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.

రైలు కదలికపై ఆధారపడాల్సిన అవసరం తగ్గింపు

సాధారణంగా ఐసీఎఫ్‌ ప్యాసింజర్‌ కోచ్‌లలో విద్యుత్‌ను యాక్సిల్‌ ఆధారిత ఆల్టర్నేటర్ల ద్వారా ఉత్పత్తి చేస్తారు. రైలు చక్రాలు కదిలే సమయంలో బెల్ట్‌ వ్యవస్థ ద్వారా ఆల్టర్నేటర్‌ పనిచేసి బ్యాటరీలను ఛార్జ్‌ చేస్తుంది. ఈ విద్యుత్‌ను కోచ్‌లోని లైట్లు, ఫ్యాన్లు, మొబైల్‌ ఛార్జింగ్‌ వంటి అవసరాలకు వినియోగిస్తారు. అయితే ఈ విధానం రైలు కదలికపై ఆధారపడి ఉండటంతో పాటు విద్యుత్‌ మార్పిడి ప్రక్రియలో కొంత శక్తి నష్టం జరుగుతుంది.

ఈ నేపథ్యంలో కోచ్‌ పైకప్పుపై సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. సూర్యరశ్మి నుంచి నేరుగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి కోచ్‌ బ్యాటరీల ఛార్జింగ్‌కు వినియోగించేలా వ్యవస్థను రూపొందించారు. దీంతో సంప్రదాయ యాక్సిల్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తిపై ఆధారపడటం తగ్గనుంది.

ఏడాదికి 13,400 యూనిట్ల విద్యుత్‌

ఈ సోలార్‌ ప్లాంట్‌ ద్వారా ఏడాదికి సుమారు 13,400 యూనిట్ల స్వచ్ఛమైన విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని అంచనా. ఫలితంగా ఒక్కో కోచ్‌కు ఏడాదికి దాదాపు రూ.2.80 లక్షల వరకు విద్యుత్‌ వ్యయం ఆదా కావచ్చని రైల్వే అధికారులు భావిస్తున్నారు. అదే సమయంలో ఒక్కో కోచ్‌ నుంచి ఏటా సుమారు 11 టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉంది.

విజయవంతమైతే మరిన్ని కోచ్‌లకు

ప్రస్తుతం ఈ సౌర విద్యుత్‌ వ్యవస్థను ఒక కోచ్‌లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. పైలట్‌ ప్రాజెక్టు పనితీరు, విద్యుత్‌ ఉత్పత్తి, నిర్వహణ వ్యయం తదితర అంశాలను పరిశీలించిన అనంతరం ఇతర ప్యాసింజర్‌ కోచ్‌లకు కూడా ఈ సాంకేతికతను దశలవారీగా విస్తరించే అవకాశం ఉంది.

కోచ్‌ పైకప్పుపైనే అందుబాటులో ఉండే సూర్యరశ్మిని విద్యుత్‌గా మార్చుకోవడం ఈ ప్రయోగంలోని ప్రధాన ప్రత్యేకత. హరిత ఇంధన వినియోగం, కార్బన్‌ ఉద్గారాల తగ్గింపు, విద్యుత్‌ వనరుల సమర్థ వినియోగం దిశగా భారతీయ రైల్వే చేపడుతున్న చర్యల్లో ఈ సోలార్‌ కోచ్‌ మరో కీలక ముందడుగుగా నిలవనుంది.