Mahaa Daily Exclusive

  డిజిటల్ మోసగాళ్ల వేటలో కేంద్రం ఉక్కుపాదం.  9,400 వాట్సాప్ ఖాతాలపై నిషేధాస్త్రం.

  • డిజిటల్ మోసగాళ్ల వేటలో కేంద్రం ఉక్కుపాదం.
  •  9,400 వాట్సాప్ ఖాతాలపై నిషేధాస్త్రం.
  • డిజిటల్ అరెస్టుల కట్టడికి బహుముఖ వ్యూహం.
  • సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదిక.

    ఢిల్లీ, మహా.
    దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ‘డిజిటల్ అరెస్టు’ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమరశంఖం పూరించింది. అమాయకులను భయభ్రాంతులకు గురిచేసి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతూ, అత్యున్నత న్యాయస్థానానికి ప్రభుత్వం కీలక నివేదికను సమర్పించింది. ఈ ముఠాల కార్యకలాపాలకు ప్రధాన వేదికగా మారుతున్న వాట్సాప్‌పై నిఘా పెంచిన కేంద్రం, నిబంధనలు ఉల్లంఘించిన ఏకంగా 9,400 ఖాతాలను నిషేధించింది. దేశంలో పెరుగుతున్న ఆన్‌లైన్ నేరాలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టిన నేపథ్యంలో, అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి ప్రభుత్వం తీసుకుంటున్న దిద్దుబాటు చర్యలను ధర్మాసనానికి వివరించారు.
    డిజిటల్ అరెస్టుల కట్టడికి కేవలం నిఘానే కాకుండా సరికొత్త సాంకేతిక పరిరక్షణ కవచాలను సైతం సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్‌లో ఇకపై ‘సిమ్ బైండింగ్’ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. దీనివల్ల ఫోన్‌లో కేవైసీ పూర్తయిన సిమ్ కార్డు ఉంటేనే వాట్సాప్ పనిచేస్తుంది. అలాగే పోలీసు లేదా ప్రభుత్వ లోగోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టుకుని సాగించే మోసాలను అరికట్టేందుకు ‘లోగో డిటెక్షన్’ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు బాధితులకు హెచ్చరికలు పంపడంతో పాటు, సదరు కాలర్ల ఫోటోలు కనిపించకుండా ఆటోమేటిక్‌గా హైడ్ చేసే ఫీచర్లను మరో 4 నుంచి 6 నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
    టెలికాం రంగంలోనూ సమూల మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. 2026 డిసెంబర్ నాటికి సిమ్ కార్డుల జారీలో నూటికి నూరు శాతం ‘బయోమెట్రిక్ ఐడెంటిటీ వెరిఫికేషన్’ విధానాన్ని తప్పనిసరి చేయనున్నారు. మోసపూరితమైనవిగా తేలిన సిమ్ కార్డులను కేవలం రెండు మూడు గంటల్లోనే బ్లాక్ చేసేలా టెలికమ్యూనికేషన్ విభాగం సన్నద్ధమైంది. మరోవైపు ఆర్థిక నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ, పది కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిన కేసులను నేరుగా సీబీఐ రంగంలోకి దిగి విచారించనుంది. ఇప్పటికే దిల్లీలో రూ. 22.92 కోట్లు కోల్పోయిన భారీ మోసం కేసును సీబీఐ రీ-రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టింది.
    బ్యాంకింగ్ వ్యవస్థలోనూ లొసుగులు లేకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను రూపొందించింది. అనుమానాస్పద లావాదేవీలు జరిగిన వెంటనే ఆ ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసి, డబ్బు మళ్లించకుండా చర్యలు తీసుకోనున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్టినేషన్ సెంటర్ (14సీ) నేతృత్వంలో టెలికాం, బ్యాంకింగ్, టెక్ సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్న తీరును నివేదికలో పొందుపరిచారు. నిబంధనలను కఠినతరం చేయడం ద్వారా దేశంలో డిజిటల్ భద్రతను పటిష్టం చేయాలని కేంద్రం పట్టుదలగా ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share