విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత.
* కుటుంబ కోర్టులో సీఎం విజయ్‌కు భారీ ఊరట.
* కేసును మూసివేసిన చెంగల్పట్టు న్యాయస్థానం.
చెంగల్పట్టు, మహా.
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌కు కుటుంబ న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆయన సతీమణి సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో చెంగల్పట్టులోని కుటుంబ సంక్షేమ న్యాయస్థానం కేసును అధికారికంగా మూసివేసింది. ఈ పరిణామంతో గత కొంతకాలంగా రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ వివాదానికి ప్రస్తుతానికి తెరపడింది.
2025 డిసెంబర్ 5న సంగీత చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ కోర్టులో విజయ్ నుంచి విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన విచారణలో ఆమె వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను స్వచ్ఛందంగా ఉపసంహరించుకుంటున్నట్లు న్యాయస్థానానికి తెలియజేశారు.
సంగీత నిర్ణయంపై విజయ్ తరఫు న్యాయవాదులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇరు పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం కేసును పూర్తిగా మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విజయ్‌కు న్యాయపరంగా పెద్ద ఊరట లభించినట్లైంది.
విజయ్, సంగీతల వైవాహిక జీవితానికి సంబంధించిన ఈ వివాదం గత కొంతకాలంగా తమిళనాడు రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమలోనూ విస్తృత చర్చకు దారితీసింది. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో చురుకుగా మారిన నేపథ్యంలో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే సంగీత తన విడాకుల పిటిషన్‌ను ఆకస్మికంగా ఎందుకు ఉపసంహరించుకున్నారనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిరిందా, లేక వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ పరిణామం ముఖ్యమంత్రి విజయ్‌కు అనుకూలంగా మారిందని రాజకీయ, సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.







