Mahaa Daily Exclusive

  ప్రపంచంతో పోటీపడేలా ‘ఫ్యూచర్‌ సిటీ’.. నాలుగో నగరంగా చరిత్ర సృష్టించే దిశగా అడుగులు.

Share

  • ప్రపంచంతో పోటీపడేలా ‘ఫ్యూచర్‌ సిటీ’..
  • నాలుగో నగరంగా చరిత్ర సృష్టించే దిశగా అడుగులు.
  • రైతుల కళ్లలో వెలుగులు నింపుతూనే నవ నగర నిర్మాణం.
  • ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంకల్పం.

హైదరాబాద్‌, మహా.

భాగ్యనగర వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ, తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ పటంలో సమున్నత శిఖరాలకు చేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఫ్యూచర్‌ సిటీ’ నిర్మాణానికి నడుం బిగించింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌ల తర్వాత రాష్ట్రానికి నాలుగో మణిహారంగా, దేశంలోనే గర్వించదగ్గ నగరంగా ఈ ఫ్యూచర్‌ సిటీ రూపుదిద్దుకోబోతోంది. మంగళవారం రంగారెడ్డి జిల్లాలో ఫ్యూచర్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌కు శంకుస్థాపన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన దార్శనికతను చాటిచెప్పారు. ఈ నగరం కేవలం భవనాల సముదాయం మాత్రమే కాదని, భవిష్యత్‌ తరాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించబోయే అద్భుతమైన కానుక అని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచ స్థాయి నగరాలతో పోటీపడేలా, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో దీనిని తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నవ నగర నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తూ, వచ్చే మే నెలలోనే ఫ్యూచర్‌ సిటీ ప్రత్యేక కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.

అయితే, ఇంతటి భారీ ప్రాజెక్టు నిర్మాణం అంత సులభమైన విషయం కాదని, అందరం కలిసికట్టుగా కృషి చేస్తేనే ఈ స్వప్నం సాకారమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఈ నగర నిర్మాణం కోసం భూములిస్తున్న రైతుల విషయంలో ప్రభుత్వం అత్యంత సున్నితంగా, మానవీయ కోణంలో వ్యవహరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధిలో భూములు కోల్పోతున్న కొందరు రైతుల్లో వ్యక్తమవుతున్న ఆందోళనను, నష్టపరిహారం విషయంలో వారి బాధను ప్రభుత్వం గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. భూమిని నమ్ముకున్న రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని, వారందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. భూమి కోల్పోతున్న వారు ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో కొంచెం దూరంలో మరోచోట భూములు కొనుగోలు చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తామని, రైతుల్లో ఎలాంటి అభద్రతాభావం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
అభివృద్ధి పనుల కోసం భూసేకరణ చేపట్టే సమయంలో అధికారులు కేవలం చట్టాలకే పరిమితం కాకుండా, మానవీయ కోణంలో ఆలోచించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పేద ప్రజల కష్టాలను అర్థం చేసుకుని, వారి సమస్యలను సావధానంగా వినాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు సూచించారు. రైతు శ్రేయస్సును విస్మరించి చేసే అభివృద్ధికి అర్థం ఉండదని, అందుకే వారిని భాగస్వాములను చేస్తూనే ఈ మహానగర నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. ఒకవైపు అత్యాధునిక సాంకేతికతతో కూడిన పోలీస్‌ కమిషనరేట్‌ వంటి వ్యవస్థల ద్వారా భద్రతను పటిష్టం చేస్తూనే, మరోవైపు భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఫ్యూచర్‌ సిటీని తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. తెలంగాణ భవిష్యత్తును మార్చే ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అప్పుడే భావి తరాలకు ఒక అద్భుతమైన నగరానిని వారసత్వంగా అందించగలమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పునరుద్ఘాటించారు.

Latest