* 18 నెలల చిన్నారికి కాలేయ మార్పిడి విజయవంతం
* తండ్రి కాలేయంతో బాలుడికి పునర్జన్మ.
హైదరాబాద్ మహా .
చారిత్రక ఉస్మానియా సామాన్య ఆసుపత్రి వైద్య రంగంలో మరో అరుదైన మైలురాయిని అధిగమించి తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రాణాంతకమైన ‘గ్లైకోజెన్ స్టోరేజ్’ అనే అరుదైన వ్యాధితో మృత్యువుతో పోరాడుతున్న 18 నెలల పసికందును ఉస్మానియా వైద్య బృందం పునర్జన్మ ప్రసాదించింది. కేవలం పది కిలోల బరువున్న ఆ బాలుడికి అత్యంత క్లిష్టమైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి, ప్రభుత్వ రంగ వైద్యం ఏమాత్రం తీసిపోదని నిరూపించారు. ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయల ఖర్చయ్యే ఈ చికిత్సను, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అమలు చేస్తున్న ‘ఆరోగ్యశ్రీ’ పథకం కింద రూపాయి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా నిర్వహించడం గమనార్హం.
ఈ అరుదైన శస్త్రచికిత్సలో కన్నప్రేమ వెల్లివిరిసింది. చిన్నారి ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ తండ్రి ముందుకు వచ్చి తన కాలేయంలోని కొంత భాగాన్ని దానం చేశారు. ఉస్మానియాలోని గ్యాస్ట్రో ఎంటరాలజీ, అనస్థీషియా మరియు ఇతర అనుబంధ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు ఏకధాటిగా 14 గంటల పాటు శ్రమించి ఈ శస్త్రచికిత్సను పూర్తి చేశారు. తండ్రి నుంచి సేకరించిన కాలేయ భాగాన్ని చిన్నారి శరీరంలో అమర్చడం, రక్తనాళాల అనుసంధానం వంటి ప్రక్రియలను అత్యంత సునిశితంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లో ఇంత చిన్న వయస్సున్న పిల్లలకు కాలేయ మార్పిడి చేయడం అత్యంత అరుదైన విషయమని వైద్య నిపుణులు అభివర్ణిస్తున్నారు.
శస్త్రచికిత్స అనంతరం చిన్నారిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కాలేయం పనితీరు ఆశాజనకంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ అద్భుత విజయాన్ని సాధించిన ఉస్మానియా వైద్య బృందాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా ఇలాంటి క్లిష్టమైన చికిత్సలు అందించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. అత్యాధునిక వసతులు, నిపుణులైన వైద్యులతో ఉస్మానియా ఆసుపత్రి పేద ప్రజలకు సంజీవనిలా మారుతోందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.








