* ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ధ్వజం.
*కేసీఆర్, కేటీఆర్, హరీష్‌లను ఇరికించేందుకు కుట్ర.
* ప్రైవేటు హ్యాకర్లతో ఫోన్ల ట్యాపింగ్.
హైదరాబాద్ మహా .
రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న పాలనలో రైతుల పరిస్థితి అత్యంత హృదయ విదారకంగా మారిందని, నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఢిల్లీ మెడలు వంచి రైతు ప్రయోజనాలను కాపాడేవారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసును అడ్డం పెట్టుకుని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి అగ్రనేతలను అక్రమంగా ఇరికించేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో మొదలైన ఈ కేసులో, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రెండో సిట్ వేశారని ఆయన మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టబద్ధంగా దేశ భద్రత కోసం ఏ ప్రభుత్వంలోనైనా జరుగుతుందని, కానీ దీనిని రాజకీయ నేతలను వేధించడానికి వాడుకోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
ఈ కేసులో ఇప్పటివరకు 350 మంది సాక్షులను విచారించినా చార్జ్ షీట్ దాఖలు చేయలేదని, దర్యాప్తు సంస్థలపై రేవంత్ రెడ్డి తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. చార్జ్ షీట్లో బీఆర్ఎస్ అగ్రనేతల పేర్లు చేర్చాలని అధికారులను బలవంతం చేస్తున్నారని, ప్రభాకర్ రావు వంటి వారిని జైలులో కరుడుగట్టిన నేరస్తుడిలా చూడటం ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమని అన్నారు. ఒక సీనియర్ జర్నలిస్టును వేధిస్తూ, హరీష్ రావు పేరు చెప్పకపోతే జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారని, సంధ్యా శ్రీధర్ రావు వంటి వ్యక్తులతో ఎమ్మెల్సీ నవీన్ రావు పేరు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత రహస్యంగా జరిగే ప్రక్రియ అని, కానీ బాధ్యత లేని హోంమంత్రిగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు వల్ల పోలీస్ యంత్రాంగం బలైపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ అరాచకాలు ఇక్కడితో ఆగడం లేదని, బెంగళూరు నుంచి ప్రైవేటు హ్యాకర్లను రప్పించి కేటీఆర్, హరీష్ రావు ఇళ్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఐపీఎస్ అధికారులు రాజకీయ బాసుల అడుగులకు మడుగులు ఒత్తవద్దని, ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణన్ కేసులో అక్రమంగా వ్యవహరించిన అధికారులకు పట్టిన గతే ఇక్కడి అధికారులకు కూడా పడుతుందని ఆయన హెచ్చరించారు. క్రిశాంక్ వంటి నాయకులను అక్రమంగా జైలుకు పంపారని, తమ ఫోన్లకు యాపిల్ సంస్థ నుంచి వచ్చిన హెచ్చరిక సందేశాలను ఇప్పటికే పోలీసులకు అందించామని తెలిపారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కేసీఆర్ ఇంటి గోడలకు నోటీసులు అంటించారని, ఇలాంటి ఎన్ని కేసులనైనా తాము ధైర్యంగా ఎదుర్కొంటామని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.








