Mahaa Daily Exclusive

  ముంబయిలో రూ.1,745 కోట్ల కొకైన్ పట్టివేత. …ఆపరేషన్ గ్లోబల్ హంట్’తో డ్రగ్స్ మాఫియా గుట్టురట్టు….

Share

హైదరాబాద్, మహా.
అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఉక్కుపాదం మోపింది. ముంబయి కేంద్రంగా సాగుతున్న అతిపెద్ద డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించి, ఏకంగా రూ.1,745 కోట్ల భారీ విలువైన 349 కిలోల అత్యున్నత నాణ్యత (హై-గ్రేడ్) గల కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల సిండికేట్‌పై జరిగిన అతిపెద్ద ఆపరేషన్లలో ఇది ఒకటిగా నిలిచింది.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఈ భారీ ఆపరేషన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. ఒక చిన్న డ్రగ్స్ పార్శిల్ రవాణాకు సంబంధించిన సమాచారంతో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు, అట్టడుగు స్థాయి నుంచి అగ్రస్థానం వరకు (బాటమ్-టు-టాప్ అప్రోచ్) నిశితంగా కూపీ లాగారు. స్థానిక డీలర్ల నెట్‌వర్క్‌ను ఛేదించుకుంటూ వెళ్లి, చివరికి ముంబయిలో రహస్యంగా దాచి ఉంచిన ఈ 349 కిలోల భారీ కొకైన్ నిల్వలను పట్టుకోవడంలో ఎన్సీబీ బృందాలు అపూర్వ విజయం సాధించాయి.

ఈ బృహత్తర నెట్‌వర్క్‌కు ప్రధాన సరఫరాదారుగా, మాస్టర్ మైండ్‌గా వ్యవహరిస్తున్న అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ మహ్మద్ సలీం డోలా (59)ను ప్రధానంగా అరెస్టు చేశారు. ఇతను మహారాష్ట్రలోని ముంబయి ప్రాంతానికే చెందినవాడు కావడం గమనార్హం. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడైన సలీం డోలా.. భారత దర్యాప్తు సంస్థల కళ్లుగప్పి విదేశాలకు పరారయ్యాడు. బల్గేరియా దేశానికి చెందిన నకిలీ పాస్‌పోర్టుతో ‘హంజా’ అనే మారుపేరుతో టర్కీలో తలదాచుకుంటూ, అక్కడి నుంచే గల్ఫ్, ఆఫ్రికా, యూరప్ దేశాలకు తన డ్రగ్స్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు.
మార్చి 2024లో భారత్ చేసిన విజ్ఞప్తి మేరకు ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసుల ఆధారంగా అంతర్జాతీయ మరియు భారతీయ ఇంటెలిజెన్స్ సంస్థలు రంగంలోకి దిగాయి. ‘ఆపరేషన్ గ్లోబల్ హంట్’ పేరిట టర్కీలో సలీం డోలాను అదుపులోకి తీసుకుని, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చి అధికారికంగా అరెస్టు చేశారు. ప్రస్తుతం ఇతడిని ముంబయి కోర్టు ఎన్సీబీ కస్టడీకి అప్పగించింది.
ఇదే నెట్‌వర్క్‌లో భాగస్వాములైన సలీం డోలా కుమారుడు తహిల్ సలీం డోలాతో పాటు అతడికి సంబంధించిన ఇతర అనుచరులను కూడా గతంలోనే పోలీసులు అరెస్టు చేశారు. యూఏఈ (దుబాయ్)లో తలదాచుకున్న వీరిని, 2025లో అక్కడి నుంచి బహిష్కరించి/అప్పగించిన అనంతరం ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారంతా ప్రధానంగా ముంబయి ప్రాంతానికి చెందిన వారేనని, విదేశాలకు మకాం మార్చి ఇండియాలోకి భారీగా మత్తుపదార్థాలను పంపిణీ చేస్తున్నారని దర్యాప్తులో స్పష్టమైంది.