- పసిడి ప్రియులకు మహాదానందం.
- పతనమైన బంగారం, వెండి ధరలు.
హైదరాబాద్, మహా.
ఆకాశమే హద్దుగా దూసుకెళ్తూ సామాన్యుడికి అందనంత ఎత్తులో కూర్చున్న పసిడి, వెండి ధరలు ఎట్టకేలకు నేలచూపులు చూశాయి. పెళ్లిళ్ల సీజన్లో ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మురిసిపోయేలా శుభవార్తను అందించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలతో దేశీయ బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా వెండి ఒకేసారి ఐదు వేల రూపాయల మేర కుప్పకూలడం కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చింది.
**దిగివచ్చిన పసిడి….లక్షన్నర మార్కు దిగువకు చేరేనా?**
తాజా బులియన్ మార్కెట్ వివరాలను పరిశీలిస్తే.. కొద్ది రోజులుగా రికార్డు గరిష్ఠాల వద్ద కదలాడుతున్న పసిడి రేట్లు కాస్త శాంతించాయి. పెట్టుబడిగా భావించే స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై తాజాగా రూ.380 మేర తగ్గుదల నమోదైంది. ఈ తాజా తగ్గింపుతో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,52,350 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, వినియోగదారులు ఆభరణాల తయారీకి అత్యధికంగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం. (స్టాండర్డ్ గోల్డ్) ధర కూడా రూ.350 మేర దిగివచ్చింది. దీంతో ఈ ఆభరణాల గోల్డ్ రేట్ రూ.1,39,650 కి చేరింది. ఏకంగా లక్షన్నర మార్కును దాటేసి భయపెట్టిన పసిడి ధరలు.. ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతుండటం మార్కెట్లో సానుకూల పవనాలకు సంకేతంగా నిలుస్తోంది.
**వెండికి భారీ కోత…ఒకేసారి రూ.5 వేలు డౌన్**
పసిడితో పోలిస్తే వెండి ధర భారీ పతనాన్ని నమోదు చేసి మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. పారిశ్రామిక వర్గాల నుంచి, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ కాస్త నెమ్మదించడంతో మార్కెట్లో కిలో వెండి ధరపై ఏకంగా రూ.5,000 మేర భారీగా కోత పడింది. ఈ అనూహ్య తగ్గుదలతో నిన్నటివరకు గరిష్ఠ స్థాయిల్లో ట్రేడ్ అయిన కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,65,000 కి దిగివచ్చింది. ఇటీవల కాలంలో వెండి ధరల్లో ఈ స్థాయి పతనం నమోదు కావడం ఇదే తొలిసారి అని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానాలు, అంతర్జాతీయ ద్రవ్యోల్బణం రేట్లలో వస్తున్న మార్పులు, డాలర్ ఇండెక్స్ ఒడిదుడుకులు బులియన్ మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయని ఆర్థిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. దానికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో బాండ్ యీల్డ్స్ పుంజుకోవడంతో పెట్టుబడిదారులు పసిడిని కాదని ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించారు. దీనివల్లే మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు దిగివచ్చాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.







