సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. హైటెక్ కేటుగాడు.
* ఏటీఎం ‘సాయం’తో ఏడేళ్ల దోపిడీకి ముగింపు.
*బెట్టింగ్ వ్యసనం.. 73 సార్లు మాయాజాలం.
* కోనసీమ రామారావు ఆట కట్టించిన పోలీసులు.
హైదరాబాద్, మహా.
చదువుకున్న చదువుకు, చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి గౌరవం ఇవ్వాల్సింది పోయి.. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఒక ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ పరమ కిరాతకమైన హైటెక్ మోసాలకు తెరలేపాడు. ఏటీఎంల వద్ద అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకుని, సాయం చేస్తామంటూ నమ్మించి గత ఏడేళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న అంతర్రాష్ట్ర నేరస్థుడు రామారావు అలియాస్ శ్రీరామ్ ఉదంతం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఏపీలోని కోనసీమ జిల్లాకు చెందిన ఈ నిందితుడిని హైదరాబాద్ పోలీసులు వ్యూహాత్మకంగా పట్టుకుని, అతను చేస్తున్న మాయాజాలానికి ముగింపు పలికారు. బెట్టింగ్ వ్యసనానికి బానిసై, సాఫ్ట్‌వేర్ కొలువు వదిలేసి మరీ సాగించిన ఈ నేరాల పరంపరలో ఎన్నో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఇటీవల సికింద్రాబాద్‌కు చెందిన ఓ మహిళ కోఠిలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్దకు లక్ష రూపాయల నగదు డిపాజిట్ చేసేందుకు రాగా, నిందితుడు రామారావు తన కపట బుద్ధితో ఆమెను బురిడీ కొట్టించాడు. తాను సాయం చేస్తానని, నిఫ్టీ ద్వారా డబ్బులు పంపిస్తానని నమ్మించి ఆమె వద్ద నుంచి లక్ష రూపాయలు తీసుకున్నాడు. టెక్నాలజీలో ఆరితేరిన నిందితుడు, ఆమెకు మొబైల్‌లో ఒక ఫేక్ మెసేజ్ చూపించి నగదు బదిలీ అయినట్లు నమ్మబలికి అక్కడి నుంచి పరారయ్యాడు. సాయంత్రం వరకు తన ఖాతాలో డబ్బులు జమ కాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు సుల్తాన్ బజార్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ హైటెక్ దొంగ గుట్టు రట్టయింది. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడు జేబీఎస్ డార్మిటరీలో ఉన్నట్లు గుర్తించి, మరొకరిని ముంచేందుకు సిద్ధమవుతుండగా నారాయణగూడ ఫ్లైఓవర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. నిందితుడు ఒకప్పుడు హైదరాబాద్‌లోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేసేవాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి క్రెడిట్ కార్డుల ద్వారా భారీగా అప్పులు చేశాడు. వాటిని తీర్చడానికి అడ్డదారులు వెతుకుతూ ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. 2018 నుంచి 2025 మధ్య కాలంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో సుమారు 73 సార్లు ఇలాంటి మోసాలకు పాల్పడ్డాడు. కేవలం తెలంగాణలోనే ఈ ఏడాదిలో అతనిపై 8 కేసులు నమోదయ్యాయి. ఏటీఎం డిపాజిట్ సెంటర్లను టార్గెట్ చేసుకుని, అక్కడ ఇబ్బంది పడే వృద్ధులను లేదా మహిళలను ఎంచుకుని వారిని మాయమాటలతో నమ్మించి నగదు కాజేయడం ఇతని పద్ధతి.
నిందితుడి నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతని బ్యాంక్ ఖాతాలోని రూ. 2.40 లక్షల నగదును వెంటనే ఫ్రీజ్ చేయించారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి ప్రజలకు పలు సూచనలు చేశారు. ఏటీఎం కేంద్రాల వద్ద గుర్తు తెలియని వ్యక్తులకు నగదు కానీ, కార్డులు కానీ ఇవ్వవద్దని కోరారు. లావాదేవీలు పూర్తయిన తర్వాత అధికారిక బ్యాంక్ యాప్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలని, అపరిచితులకు పిన్ నంబర్లు లేదా ఓటీపీలు చెప్పవద్దని హెచ్చరించారు. ఎవరైనా సాయం చేస్తామంటూ దగ్గరకు వస్తే అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.







