Mahaa Daily Exclusive

  రికార్డు స్థాయికి తెలంగాణ ఆదాయం..

Share

  • రికార్డు స్థాయికి తెలంగాణ ఆదాయం
  • దూసుకుపోయిన జీఎస్టీ వసూళ్లు
  • ఏప్రిల్‌ లో 35% వృద్ధి

​హైదరాబాద్, మహా : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. 2026 ఏప్రిల్ నెలలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అత్యధిక వసూళ్లను నమోదు చేస్తూ చరిత్ర సృష్టించింది. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 35 శాతం భారీ వృద్ధి నమోదైనట్లు వాణిజ్య పన్నుల కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 2026లో ఏకంగా రూ. 4,621 కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది. గత ఏడాది ఇదే నెలలో ఈ మొత్తం రూ. 3,433 కోట్లుగా ఉండగా, ఇప్పుడు అదనంగా రూ. 1,188 కోట్లు వసూలైంది. జీఎస్టీ వ్యవస్థ అమలులోకి వచ్చినప్పటి నుండి ఒక నెలలో ఈ స్థాయిలో ఆదాయం రావడం ఇదే మొదటిసారి. గత నాలుగు నెలలుగా తెలంగాణ జీఎస్టీ ఆదాయం స్థిరంగా రూ. 4,000 కోట్లకు పైగానే నమోదవుతోంది. జీఎస్టీతో పాటు పెట్రోల్, మద్యంపై వ్యాట్, వృత్తి పన్నులను కలుపుకుని మొత్తం రూ. 7,570 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి చేరింది.

​దేశంలోనే రెండో స్థానం

పన్ను వసూళ్ల వృద్ధి రేటులో కర్ణాటక తర్వాత తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచి తన ఆర్థిక సత్తాను చాటింది. ఆదాయం పెరగడానికి కారణాలను పరిశీలిస్తే ​రాష్ట్రంలో కీలక రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, వ్యాపార అనుకూల వాతావరణం వల్ల కొత్త పెట్టుబడులు రావడం ఈ వృద్ధికి ప్రధాన కారణాలని అధికారులు విశ్లేషిస్తున్నారు. అలాగే, పన్ను చెల్లింపుదారులు స్వచ్ఛందంగా, పారదర్శకమైన విధానాలతో పన్నులు చెల్లించడం వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది.
​పన్ను చెల్లింపుదారులకు మరింత అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు, మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని వాణిజ్య పన్నుల కమిషనర్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.