* డిస్పాచ్ సెంటర్ల వద్దే అధికారుల పహారా.
* సీఎం చంద్రబాబు కఠిన ఆదేశాలు!
*సరఫరా ఆగకూడదు.. ధరలు పెరగకూడదు.
* బ్లాక్ మార్కెట్ ఆడితే సహించేది లేదు.
* అక్రమ నిల్వలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఏ పి ముఖ్యమంత్రి ఆదేశం.
అమరావతి, మహా.
రాష్ట్రంలో సామాన్య ప్రజానీకానికి నిత్యావసర వస్తువుల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా వంట నూనెల ధరలు, లభ్యతపై వస్తున్న ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన ఆయన, తక్షణమే క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్ డిస్పాచ్ సెంటర్లు మరియు టెర్మినళ్ల వద్దకు స్వయంగా వెళ్లి, అక్కడి నుంచి సరఫరా ఎలా సాగుతుందో నిరంతరం పర్యవేక్షించాలని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. కృత్రిమ కొరత సృష్టించి లాభపడాలని చూసే వారిపై ఉక్కుపాదం మోపాలని, ప్రజల అవసరాలతో ఆడుకుంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆయిల్ కంపెనీల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు, అక్కడి నుంచి రిటైల్ మార్కెట్‌కు సరఫరా గొలుసు ఎక్కడా తెగిపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని పేర్కొన్నారు. కొన్ని చోట్ల వ్యాపారులు నిల్వలను దాచిపెట్టి ధరలను పెంచుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి అక్రమ నిల్వ దారుల గోదాములపై తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. డిస్పాచ్ సెంటర్ల నుంచి బయటకు వచ్చే ప్రతి లీటర్ ఆయిల్ ఎక్కడికి వెళ్తోంది, ఎంత ధరకు విక్రయించబడుతోంది అనే అంశాలపై నిశితమైన నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు.
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే నూనెల ధరల ప్రభావం రాష్ట్ర మార్కెట్‌పై పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి సరఫరాను వేగవంతం చేయాలని బాబు సూచించారు. పోర్టుల వద్ద ఆగిపోయిన ఆయిల్ కంటైనర్ల క్లియరెన్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా ఉండాలంటే మార్కెట్‌లో పోటీని పెంచాలని, అన్ని బ్రాండ్ల నూనెలు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా కలెక్టర్లు మరియు పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రతిరోజూ నివేదికలు పంపాలని, ధరల పెరుగుదలపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.
రాష్ట్రంలోని రేషన్ షాపుల ద్వారా కూడా వంట నూనెల పంపిణీని క్రమబద్ధీకరించాలని, బహిరంగ మార్కెట్‌లో ధరల కట్టడికి రైతు బజార్ల ద్వారా రాయితీ ధరలకు నూనెలను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని చక్కదిద్దాలని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.







