Mahaa Daily Exclusive

  కోహినూర్ భారత్‌దే.. తిరిగి ఇచ్చేయండి!

Share

* బ్రిటన్ రాజును కోరతానన్న భారత సంతతి నేత జోహ్రాన్ మామదాని.
* తెలుగు నేల ‘మణిహారం’పై మళ్ళీ చర్చ.
* సత్తెనపల్లి నుంచి లండన్ దాకా కోహినూర్ ప్రస్థానం..

హైదరాబాద్, మహా.

తెలుగు నేల గర్భం నుంచి పుట్టి, ప్రపంచాధిపతుల కిరీటాలను అలంకరించి, ప్రస్తుతం లండన్ టవర్ మ్యూజియంలో బందీగా ఉన్న ‘కోహినూర్’ వజ్రం అంశం మరోసారి అంతర్జాతీయ వేదికపై మారుమోగుతోంది. తాజాగా న్యూయార్క్‌కు చెందిన భారత సంతతి నేత జోహ్రాన్ మామదాని చేసిన వ్యాఖ్యలు కోహినూర్ చరిత్రను మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకువచ్చాయి. బ్రిటన్ రాజు చార్లెస్-3 ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న తరుణంలో, ఆయనను కలిసే అవకాశం వస్తే కోహినూర్ వజ్రాన్ని వెంటనే భారత్‌కు తిరిగి ఇచ్చేయాలని తాను స్వయంగా కోరతానని మామదాని ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఒకప్పుడు సామ్రాజ్యాల గమనాన్ని మార్చేసిన ఈ అపురూప మణిని స్వదేశానికి తెప్పించాలన్న భారతీయుల దశాబ్దాల ఆకాంక్షకు ఈ వ్యాఖ్యలు మరోసారి ప్రాణం పోశాయి.
కోహినూర్ ప్రస్థానం అత్యంత సాహసోపేతమైనది మరియు వివాదాస్పదమైనది. క్రీస్తుశకం 1630 ప్రాంతంలో నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి సమీపంలో ఉన్న కొల్లూరు గ్రామంలో ఒక వితంతువుకు ఈ వజ్రం లభించిందని చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఇది సుమారు 700 క్యారెట్లకు పైగా బరువు ఉండేదని, అప్పటి గోల్కొండ నవాబుల మంత్రి మీర్ జుమ్లా దీనిని మొగల్ చక్రవర్తి షాజహాన్‌కు కానుకగా ఇచ్చారని ప్రతీతి. అలా మొగలుల ‘నెమలి సింహాసనాన్ని’ అలంకరించిన ఈ వజ్రం, 1739లో పర్షియా పాలకుడు నాదిర్ షా దండయాత్రతో దేశం దాటి పోయింది. ఆ తర్వాతి కాలంలో అహ్మద్ షా అబ్దాలీ నుంచి 1813లో పంజాబ్ కేసరి మహారాజా రంజిత్ సింగ్ చేతికి చిక్కిన ఈ వజ్రం, చివరకు 1849లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్‌ను ఆక్రమించుకున్నప్పుడు పదేళ్ల బాలుడైన మహారాజా దులీప్ సింగ్ ద్వారా విక్టోరియా రాణి వశమైంది.
అయితే, ఈ వజ్రం చుట్టూ ఒక వింతైన నమ్మకం కూడా అల్లుకుని ఉంది. కోహినూర్ వజ్రం పురుషులకు అరిష్టమని, దానిని ధరించిన పురుష పాలకులు ఎవరూ ప్రశాంతంగా ఉండలేదని, చివరకు తమ సామ్రాజ్యాలను కోల్పోయారని చరిత్రకారులు పేర్కొంటారు. అల్లావుద్దీన్ ఖిల్జీ నుంచి షాజహాన్, నాదిర్ షా, రంజిత్ సింగ్ వరకు దీనిని ధరించిన వారంతా అష్టకష్టాలు పడ్డారని, అందుకే బ్రిటిష్ రాజకుటుంబంలోని పురుషులు దీనిని ముట్టుకోవడానికి కూడా సాహసించలేదని చెబుతారు. దీనికి విరుద్ధంగా మహిళలకు మాత్రం ఇది అత్యంత అదృష్టమని భావిస్తారు. విక్టోరియా రాణి నుంచి ఎలిజిబెత్-2 వరకు అందరూ దీనిని తమ కిరీటాల్లో అలంకరించుకుని దీర్ఘకాలం పాలన సాగించడం ఈ నమ్మకాన్ని బలపరిచింది. ప్రస్తుతం ఇది లండన్ టవర్‌లోని జువెల్ హౌస్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రజా ప్రదర్శనలో ఉంది.
కోహినూర్ తిరుగు ప్రయాణం కోసం భారత్ 1947 నుంచే దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గతంలో బ్రిటన్ ప్రధానులు ఈ డిమాండ్‌ను తోసిపుచ్చినప్పటికీ, ఇటీవల బ్రిటన్ సాంస్కృతిక శాఖ మంత్రి లీసా నాంది చేసిన వ్యాఖ్యలు కొంత ఆశలు చిగురింపజేస్తున్నాయి. భారత్-బ్రిటన్ మధ్య సాంస్కృతిక కళాఖండాల మార్పిడి కోసం ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయని, అన్నీ సానుకూలంగా జరిగితే ఆమోదయోగ్యమైన నిర్ణయం రావచ్చని ఆమె నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఒకవైపు పాకిస్థాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు కూడా ఈ వజ్రం తమదేనని వాదిస్తున్నప్పటికీ, దాని పురిటిగడ్డ అయిన తెలుగు నేల నుంచే ఇది భారత్‌కు చేరాలని కోట్లాది మంది భారతీయులు వేచి చూస్తున్నారు.