- శూన్యంలోకి వామపక్షాలు
- 50 ఏళ్లలో తొలిసారి ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేకుండా వామపక్షాలు
- ఒకప్పుడు బెంగాల్, త్రిపుర, కేరళలో తిరుగులేని ఆధిపత్యం
- 2011లో పశ్చిమ బెంగాల్.. 2018లో త్రిపుర కోటలు బద్దలు
న్యూఢిల్లీ, మహా : ఒకప్పుడు దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా వెలుగొందిన వామపక్షాలు, ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేని పరిస్థితి నెలకొంది. గత ఐదు దశాబ్దాల్లో ఇలాంటి రాజకీయ శూన్యం ఏర్పడటం ఇదే తొలిసారి. తమ చివరి కంచుకోట కేరళలోనూ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) అధికారం కోల్పోయింది. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీల భవిష్యత్తుపై తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా కేరళలో వెలువడిన ఫలితాల ప్రకారం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోయింది. దీంతో వామపక్షాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేని చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కేరళంలో అఖండ విజయం సాధించిన నేపథ్యంలో తిరువనంతపురంలోని కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు అంబరాన్ని తాకాయి. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో వామపక్షాలది కీలక పాత్ర. 1996లో సీపీఎం అగ్రనేత జ్యోతి బసు యునైటెడ్ ఫ్రంట్ తరఫున ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా, పార్టీ పొలిట్‌బ్యూరో ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. దీనిని ఆయన తర్వాత ‘చారిత్రక తప్పిదం’గా అభివర్ణించారు. 2008లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం పార్లమెంటులో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర.. ఇలా మూడు రాష్ట్రాల్లో లెఫ్ట్ పార్టీలు అధికారంలో ఉన్నాయి.
భారత రాజకీయాల్లో కమ్యూనిస్టులది సుదీర్ఘ, ప్రభావవంతమైన చరిత్ర. 1957లో కేరళలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వంగా ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇక, పశ్చిమ బెంగాల్లో 1977 నుంచి 2011 వరకు ఏకధాటిగా 34 ఏళ్లు పాలించి, దేశంలోనే సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీగా చరిత్రకెక్కారు. జ్యోతిబసు ఒక్కరే 23 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే, త్రిపురలోనూ 1993 నుంచి మాణిక్ సర్కార్ నేతృత్వంలో వరుస విజయాలు సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్ద కాలంగా వామపక్షాల ప్రాభవం క్రమంగా తగ్గుతూ వచ్చింది. సింగూర్, నందిగ్రామ్ భూసేకరణ ఉద్యమాల నేపథ్యంలో 2011లో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చేతిలో లెఫ్ట్ ఫ్రంట్ అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత 2018లో బీజేపీ ప్రభంజనంలో త్రిపుర కోట కూడా బద్దలైంది. దీంతో కేరళ ఒక్కటే వామపక్షాలకు చివరి ఆశగా మిగిలింది. 2021లో రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి పినరయి విజయన్ సంచలనం సృష్టించారు. అయితే, తాజా ఎన్నికల ఫలితాలు వామపక్షాల పాలన శకం ముగింపు దశకు తీసుకు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వామపభ పార్టీలు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో తోక పార్టీలుగా మిగలగా, మరికొన్ని రాష్ట్రాలలో ఉనికి కోసం పాకులాడాలాస్ని పరిస్థితి నెలకొంది. తాజా రాజకీయ పరిణామంతో ఈ పార్టీల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.








