కొత్వాల్‌గూడలో ‘హైడ్రా’ సంచలనం..
* మంత్రి పొంగులేటి రాఘవ క్రషర్స్ నేలమట్టం!
* అక్రమ మైనింగ్ అడ్డాపై ఉక్కుపాదం మోపిన సర్కార్
* హరీష్ రావు సాక్ష్యాలతో బట్టబయలు.
* చివరకు తోకముడిచిన ‘పొంగులేటి’ వ్యూహాలు.
* వందల కోట్ల దోపిడీ.. గుట్టలను పిండి చేసినా పట్టించుకోని శాఖలు.. హైడ్రా దెబ్బతో క్లోజ్!.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో గత కొంతకాలంగా సాగుతున్న అక్రమ మైనింగ్ సామ్రాజ్యం చివరకు కుప్పకూలింది. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి చెందిన ‘రాఘవ క్రషర్స్’ యూనిట్లపై హైడ్రా బృందాలు మెరుపు దాడులు నిర్వహించి కూల్చివేతలు చేపట్టాయి. అక్రమంగా కొండలను పిండి చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ క్రషర్ల వ్యవహారంపై విపక్షాలు చేసిన పోరాటం చివరకు విజయం సాధించింది. ప్రభుత్వ అండదండలతో సాగుతున్న ఈ అక్రమ దందాపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఇన్నాళ్లు మౌనంగా ఉన్న యంత్రాంగం, సాక్ష్యాలు బట్టబయలు కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
**హరీష్ రావు సాక్ష్యాలు.. అసెంబ్లీలో ప్రకంపనలు**
మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్ రావు పక్కా ఆధారాలతో సహా బయటపెట్టారు. అసెంబ్లీ వేదికగా రాఘవ క్రషర్స్ చేస్తున్న అక్రమాలను, పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని ఆయన ఎండగట్టారు. రెండేళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఈ క్రషర్లను నిర్వహిస్తూ వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న తీరును ఆయన ఆధారాలతో నిరూపించారు. తొలుత అసలు అక్రమ మైనింగ్ జరగట్లేదని, అంతా సక్రమమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి బుకాయించే ప్రయత్నం చేసినప్పటికీ, విపక్షాల పోరాటం ముందు వారి అబద్ధాలు నిలవలేదు.
**రాత్రికి రాత్రే పేర్ల మాయం.. బయటపడ్డ భయం**
బీఆర్ఎస్ నాయకులు క్షేత్రస్థాయిలో ఆధారాలు సేకరించడం ప్రారంభించగానే, రాఘవ క్రషర్స్ యాజమాన్యంలో వణుకు మొదలైంది. అక్రమ మైనింగ్ దందా బయట పడకుండా ఉండేందుకు రాత్రికి రాత్రే కంటెయినర్ల పై ఉన్న ‘రాఘవ క్రషర్స్’ పేరును పెయింటింగ్‌తో మాయం చేసేశారు. అయితే, ఈ లోపే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. ఒక మంత్రి హోదాలో ఉండి అక్రమ వ్యాపారాలు చేయడం, అవి బయటపడగానే ఇలాంటి చోటా పనులు చేసి తప్పించుకోవాలని చూడటంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ పెద్దల కళ్లముందే గుట్టలు మాయమవుతున్నా ఇన్నాళ్లు పట్టించుకోని అధికారులు ఇప్పుడు హైడ్రా యాక్షన్‌తో రంగంలోకి దిగారు.
**అధికార యంత్రాంగం నిర్లక్ష్యం.. ప్రజల ఆగ్రహం**
నిజానికి ఈ అక్రమ మైనింగ్ వెనుక పొల్యూషన్, మైనింగ్, రెవెన్యూ మరియు విద్యుత్ శాఖల అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అనుమతులు లేకపోయినా విద్యుత్ కనెక్షన్ ఎలా ఇచ్చారు? పర్యావరణ అనుమతులు లేకుండా ఇన్నేళ్లు ఎలా నడిచాయి? అన్న ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. స్థానిక ప్రజలు కూడా ఈ క్రషర్ల వల్ల వస్తున్న కాలుష్యం, శబ్దాల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు చేశారు. ప్రజా క్షేత్రంలో తీవ్ర వ్యతిరేకత రావడం, విపక్షాలు రాజీలేని పోరాటం చేయడంతో చివరకు ప్రభుత్వం దిగివచ్చి పొంగులేటిని ఒప్పించి కూల్చివేతలకు సిద్ధపడింది.
**బీఆర్ఎస్ నైతిక విజయం.. ప్రభుత్వానికి హెచ్చరిక**
మంత్రి పొంగులేటి క్రషర్ల కూల్చివేతను బీఆర్ఎస్ పార్టీ తన నైతిక విజయంగా అభివర్ణిస్తోంది. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని తాము చేసిన ఆరోపణలు నేడు నిజమయ్యాయని వారు పేర్కొంటున్నారు. కేవలం విపక్ష నేతలపైనే కాకుండా, సొంత పార్టీ మంత్రుల అక్రమాలపై కూడా చర్యలు తీసుకోవాల్సిందేనని హైడ్రా ఈ కూల్చివేతల ద్వారా నిరూపించింది. అయితే, కేవలం కూల్చివేతలతో సరిపెట్టకుండా, ఇన్నాళ్లు అక్రమంగా సంపాదించిన వందల కోట్ల సొమ్మును రికవరీ చేయాలని మరియు బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.








