Mahaa Daily Exclusive

  టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్ వన్…

Share

టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్ వన్.
* రెండో ప్లేస్‌లో ఇంగ్లండ్.
* టీమిండియా.. 275 పాయింట్లతో టాప్.
* 98కి పడిపోయిన టీ20 జట్ల సంఖ్య.
* ఐసీసీ తాజా జాబితా విడుదల.
హైదరాబాద్, మహా.

పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. మైదానంలో పరుగుల వరద పారిస్తూ, అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్న టీమిండియా తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన వార్షిక టీ20 ర్యాంకింగ్స్‌లో ఏకపక్ష ఆధిపత్యం ప్రదర్శించింది. ఏకంగా 275 రేటింగ్ పాయింట్లతో ఏ జట్టు దరిదాపుల్లో లేకుండా నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇటీవల మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడి చరిత్ర సృష్టించిన భారత జట్టు, అదే జోరును ర్యాంకింగ్స్‌లోనూ కొనసాగించి దుమ్మురేపింది. ఇంగ్లండ్ జట్టు 262 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, ఆస్ట్రేలియా 258 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. టాప్-7 స్థానాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. న్యూజిలాండ్ (247), సౌతాఫ్రికా (244), పాకిస్థాన్ (240), వెస్టిండీస్ (233) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. మూడుసార్లు టీ20 కప్పును గెలిచిన జట్టుగా రికార్డులకెక్కిన టీమిండియా భవిష్యత్తు సిరీస్‌ల్లోనూ ఇదే జోరును కొనసాగించేలా కనిపిస్తోంది.

ఆసియా దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల ర్యాంకుల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఆరు పాయింట్లు కోల్పోయిన శ్రీలంక జట్టు (221 పాయింట్లు) ఒక స్థానం దిగజారి తొమ్మిదో స్థానానికి పడిపోగా, బంగ్లాదేశ్ (225 పాయింట్లు) ఒక స్థానం ఎగబాకి ఎనిమిదో ర్యాంకును కైవసం చేసుకుంది. అఫ్గానిస్థాన్ (220) జట్టు శ్రీలంకకు అత్యంత చేరువలో ఉంటూ పదో స్థానంలో కొనసాగుతోంది. ఇక పసికూనలుగా భావించే జింబాబ్వే, ఐర్లాండ్ జట్లు వరుసగా 11, 12 స్థానాల్లో నిలిచాయి.

ఈ తాజా ర్యాంకింగ్స్ కోసం ఐసీసీ కొత్త పద్ధతిని అనుసరించింది. 2025 మే నెల నుంచి జరిగిన మ్యాచ్‌లకు 100 శాతం వెయిటేజీని ఇవ్వగా, అంతకు ముందు రెండేళ్ల పాటు జరిగిన మ్యాచ్‌లకు 50 శాతం వెయిటేజీని కేటాయించి పాయింట్లను లెక్కగట్టింది. ఈ నిబంధనల ప్రకారం జట్ల ర్యాంకుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక గత మూడేళ్ల కాలంలో కనీసం ఎనిమిది టీ20 మ్యాచ్‌లు ఆడని జట్లపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. ఈ నిబంధనను చేరుకోలేకపోయిన ఫిజీ, గాంబియా, గ్రీస్, ఇజ్రాయెల్ జట్లను టీ20 ర్యాంకింగ్స్ జాబితా నుంచి తొలగించింది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఉన్న మొత్తం జట్ల సంఖ్య 102 నుంచి 98కి పడిపోయినట్లు ఐసీసీ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి.