ఆయన ‘ఎగవేతల’ రేవంత్ రెడ్డి.
* ఒక్క ఊళ్లో పూర్తి రుణమాఫీ అయినా రాజీనామాకు సిద్ధం.
* 69 సార్లు ఢిల్లీకెళ్లి 69 పైసలు తేలేదు.
* ఇక్కడ నడుస్తున్నది రైతుబంధు కాదు రాహుల్ బంధు.
• బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఫైర్.
హైదరాబాద్, మహా.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, రైతులను నిలువునా మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిని ‘ఎనుముల రేవంత్ రెడ్డి’ కాదు, ‘ఎగవేతల రేవంత్ రెడ్డి’ అని ఆయన తీవ్ర పదజాలంతో విమర్శించారు. దమ్ముంటే తనతో ఏ ఊరికైనా రావాలని, కనీసం ఒక్క ఊరిలోనైనా వంద శాతం రైతులందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే.. తాను తక్షణమే రాజకీయాల నుంచి రాజీనామా చేస్తానని కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా దందాలు, కమీషన్లు, కొట్లాటల మయంగా మారిందని మండిపడ్డారు. బుధవారం
వరంగల్ పర్యటనలో భాగంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరిని ఎండగట్టారు. ఎన్నికలకు ముందు సరిగ్గా ఇదే వరంగల్ గడ్డపైకి వచ్చి, ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి మీద ఒట్టుపెట్టి మరీ డిసెంబర్ 9 నాటికి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికాడని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ తీరా అధికారంలోకి వచ్చాక దేవుళ్లను, రైతులను ఏకకాలంలో మోసం చేశాడని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ చేసిన రుణమాఫీ ‘చారానా.. పెట్టిన టోపీ బారానా’ అన్న చందంగా తయారైందని ఎద్దేవా చేశారు. బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన రైతన్నలు, అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్న దయనీయ పరిస్థితులు రాష్ట్రంలో దాపురించాయని కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
**ఢిల్లీకి కప్పం.. రాష్ట్రంలో ‘రాహుల్ బంధు’**
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపైనా కేటీఆర్ సెటైర్లు వేశారు. అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే రేవంత్ రెడ్డి ఏకంగా 69 సార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేశాడని, కానీ రాష్ట్రానికి కనీసం 69 పైసల నిధులు కూడా తీసుకురాలేదని తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి అసలు ఒక రెగ్యులర్ ముఖ్యమంత్రి కాదని, ఎప్పటికప్పుడు ఢిల్లీ పెద్దల దయాదాక్షిణ్యాలతో నెట్టుకొస్తున్న ‘రెన్యువల్ సీఎం’ అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి రైతుల కష్టాలు తీర్చడానికి, వారి ఖాతాల్లో డబ్బులు వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పైసలు లేవు కానీ.. ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాత్రం మూటలకు మూటలు పంపిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘రైతుబంధు’ అమలు చేయడం లేదని, ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టే ‘రాహుల్ బంధు’ నడుస్తోందని కేటీఆర్ దుయ్యబట్టారు.
**రైతు ప్రగతికి కేసీఆరే బ్రాండ్ అంబాసిడర్**
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రైతులు రారాజుల్లా బతికారని కేటీఆర్ గుర్తుచేశారు. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో రైతును రాజుగా చూసుకున్న ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆగమైపోయిన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని అద్భుతమైన పథకాలతో కేసీఆర్ తిరిగి గాడిలో పెట్టారని, రైతు ప్రగతికి ఒక విప్లవాన్ని సృష్టించారని కొనియాడారు. కేవలం పదేళ్ల కాలంలోనే తెలంగాణ రైతాంగం కోసం రూ. 5 లక్షల కోట్లు వెచ్చించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేసీఆర్ దార్శనికత వల్లే వరంగల్ సహా రాష్ట్రవ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగిందని, తద్వారా భూముల రేట్లు కోట్లకు పడగలెత్తాయని వివరించారు. కానీ కాంగ్రెస్ రాతి యుగం పాలనతో మళ్లీ భూముల ధరలు అమాంతం పాతాళానికి పడిపోయాయని ఆయన విమర్శించారు.
**మళ్లీ పాత రోజులు.. కొనుగోలు కేంద్రాల్లో కన్నీళ్లు**
కాంగ్రెస్ అసమర్థ పాలనతో రాష్ట్రంలో మళ్లీ పాత కష్టాలు మొదలయ్యాయని కేటీఆర్ వాపోయారు. పండించిన ధాన్యం అమ్ముకునేందుకు రైతులు రోజుల తరబడి వానల్లో, ఎండల్లో కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్సెట్టిపేట కొనుగోలు కేంద్రంలో గోడ కూలి నలుగురు అమాయక రైతులు ప్రాణాలు కోల్పోవడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి, నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యమని ఆయన మండిపడ్డారు. ప్రజల గురించి, రైతుల ఆకలి చావుల గురించి పట్టించుకునే నాథుడే కాంగ్రెస్ ప్రభుత్వంలో కరువయ్యాడని విమర్శించారు. అన్నదాతలను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు.








