- రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం
- సోలార్ విద్యుత్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
- విద్యుత్ శాఖ ఏఈ వెంకన్న
కారేపల్లి, మహా :రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని ఆ దిశగా విద్యుత్ శాఖ పనిచేస్తుందని విద్యుత్ శాఖ కారేపల్లి మండల ఏఈ వెంకన్న అన్నారు. కారేపల్లి మండలంలోని రొట్టమాకురేవు రైతు వేదికలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సభలో ఏఈ వెంకన్న మాట్లాడుతూ… సోలార్ విద్యుత్ పథకాల పై రైతులు అవగాహన పెంచుకుని ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సమస్యలను 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. గృహజ్యోతి పథకం తో పాటు ప్రభుత్వ విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా కోసం ఇంటర్ లింకింగ్ లైన్లతో విద్యుత్ శాఖ పనిచేస్తుందని చెప్పారు. పొలం బాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ అధికారులు నేరుగా రైతుల పొలాలకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. వినియోగ దారులకు మరింత చేరువై వారి సమస్యలను పరిష్కరించడం కోసం విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం అందుబాటులో ఉందని వివరించారు. వ్యవసాయ సర్వీసుల మంజూరు ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు ఉచిత ట్రాన్స్ఫార్మర్ల్ రవాణా కూడా విద్యుత్ శాఖ చేస్తుందని అన్నారు. అటవీ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలను నివారించడానికి డిపార్ట్మెంట్ కవర్డ్ కండక్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ శాఖ సేవలను రైతులు, విద్యుత్ వినియోగ దారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మోతి వీరస్వామి, మతృనాయక్, సొసైటీ డైరెక్టర్ అడ్డగోడ ఐలయ్య, మండల వ్యవసాయాధికారి భట్టు అశోక్ కుమార్ పాల్గొన్నారు.








