Mahaa Daily Exclusive

  పిఠాపురం టీడీపీలో అనూహ్య పరిణామం

Share

  • పిఠాపురం టీడీపీలో అనూహ్య పరిణామం
  • ఇంచార్జ్ పదవి నుంచి వర్మను తొలగించిన పార్టీ
  • కన్నీరు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే

కాకినాడ, మహా : పిఠాపురం నియోజకవర్గ టీడీపీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత కొంతకాలంగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మను ఆ బాధ్యతల నుండి తప్పిస్తూ టీడీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. పిఠాపురంలో తన అనుచరులు, కార్యకర్తలతో భేటీ అయిన వర్మ.. మీడియా ముందు మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఒకానొక దశలో కన్నీళ్లు ఆపుకోలేక ప్రెస్ మీట్‌ను మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. పిఠాపురం ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తనను తప్పిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయంపై వర్మ స్పందిస్తూ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలో పార్టీ ప్రయోజనాల కోసం త్యాగం చేయాలని హైకమాండ్ కోరింది, అప్పుడు కూడా కాదనకుండా పనిచేశాను. ఎప్పుడూ పార్టీ బలోపేతానికే కృషి చేశాను తప్ప, ఎన్నడూ వ్యతిరేకంగా పనిచేయలేదు అని ఆయన భావోద్వేగంతో చెప్పారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన ఒక నాయకుడు ఇలా బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి రావడం స్థానిక కార్యకర్తలను సైతం కలిచివేసింది.

నియోజకవర్గంలో కూటమి మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక కమిటీని వేయాలని తానే నారా లోకేష్‌ ను కోరినట్లు వర్మ వెల్లడించారు. తన వ్యక్తిగత నిర్ణయమే అయినప్పటికీ, అధికారికంగా బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి రావడం ఆయనను ఆవేదనకు గురిచేసింది. మంత్రి లోకేష్ తనతో మాట్లాడిన తర్వాతే ఈ నూతన కమిటీ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని, దీనికి తన పూర్తి సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

కూటమి సమీకరణాలతో మార్పులు

పిఠాపురం ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో, ఇక్కడ టీడీపీ-జనసేన శ్రేణుల మధ్య సమన్వయం అత్యంత కీలకంగా మారింది. గత కొంతకాలంగా స్థానిక జనసేన నేతలు , వర్మ అనుచరుల మధ్య చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు, వివాదాలతో కూటమిలో ఘర్షణ వాతావరణం లేకుండా చూసేందుకే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. వర్మను ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తప్పించడం ద్వారా జనసేనతో ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేయాలని టీడీపీ యోచిస్తోంది.

కార్యకర్తల్లో నిశ్శబ్దం

మీడియా సమావేశంలో తన రాజకీయ ప్రస్థానాన్ని, పార్టీ పట్ల తనకున్న నిబద్ధతను గుర్తు చేసుకుంటూ వర్మ కన్నీరు పెట్టుకున్నారు. తాను పార్టీని నమ్ముకుని ఉన్నానని, కానీ ప్రస్తుత పరిస్థితులు తనను బాధించాయని చెబుతూ ఆయన ప్రెస్ మీట్ మధ్యలోనే నిష్క్రమించారు. పిఠాపురంలో వర్మకు ఉన్న క్యాడర్ బలం దృష్ట్యా, ఆయనను పదవి నుంచి తప్పించడం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని చర్చ నడుస్తోంది. పార్టీ త్వరలోనే ఇక్కడ కొత్త కమిటీని ప్రకటించే అవకాశాలున్నాయి.